
తాటి కల్లు విన్నాం.. ఈత కల్లు విన్నాం.. కానీ ఖర్చూర కల్లు గురించి తక్కువగానే విని ఉంటాం. ఖర్జూర కల్లు గురించి తెలిస్తే మాత్రం దానికి తాగకుండా ఉండలేం. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల తాటికల్లు తాగాలని పదే పదే చెబుతోంది.. కొందరు మంత్రులైతే ఆకు పట్టి మరీ కల్లుతాగి చూపిస్తూ కల్లుతాగండి మహాప్రబో అని అంటున్నారు.. రాష్ట్రంలో తాటి, ఈత కల్లుకు ఆయా సీజన్లలో డిమాండ్ ఎక్కువే ఉంటుంది. అయితే డిమాండ్ కు అనుగుణంగా కల్లు లభ్యమవుతుంది. లెటెస్టుగా ఖర్జూర కల్లుకు ఫుల్ డిమాండ్ ఏర్పడుతోంది. అయితే ఇది డిమాండ్ కు అనుగుణంగా లభ్యం కావడం లేదు. తెలంగాణలోని ఒకే ఒక్క చోట ఖర్జూర కల్లు దొరుకుతోంది. ఆ కల్లు కావాలంటే కొన్ని రోజుల ముందే ఆర్డర్ చేయాలట.. ఈ కల్లుకు అంత డిమాండ్ ఎందుకు..? అందులో ఏముంది..?
తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా.. కల్వకుర్తి మండలంలో టర్నికల్ అనే గ్రామం ఉంది. ఈ గ్రామంతో పాటు చుట్టుపక్కలా ఉళ్లల్లో తాటి, ఈత చెట్లు ఉన్నాయి. కానీ ఈ ప్రాంత ప్రజలు ఎక్కువగా ఖర్జూర కల్లు మాత్రమే తాగుతున్నారు . తాటికల్లు, ఈత కల్లు ఎంత మంచిగా ఉన్న ఖర్జూర కల్లు వైపు మాత్రమే మొగ్గు చూపుతున్నారు. అచ్చం తాటికల్లు మాదిరిగానే కనిపించే ఇందులో ప్రత్యేకత ఉందట. అదేంటంటే..?
తాటికల్లు, ఈతకల్లు తాగితే మత్తు వస్తుంది.. అలాగే చెమట వస్తుంది.. కానీ ఖర్చూర కల్లు తాగితే ముఖంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయంటున్నారు ఇక్కడ కల్లు గీసే యాదయ్య. అయితే అతిగా మద్యం సేవించేవారు కాకుండా కల్లు తాగాలనుకునేవారు మాత్రమే ఖర్జూర కల్లును సేవిస్తున్నారని అంటున్నారు. ఇక ఉన్నత వర్గానికి చెందిన వారు కొందరు ముందే ఆర్డర్ చేసి మరీ కల్లును తీసుకెళ్తున్నారట. ఇందులో ఆల్కహాల్ 4 నుంచి 6 శాతం ఉంటుందని అబ్కారీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
ఈ సందర్భంగా యాదయ్య ఖర్జూర కల్లును తీసేందుకు ఎన్నో కష్టాలు పడ్డానని తెలిపాడు. మొదట తాను 1600 ఖర్జూర చెట్లను నాటాడట. అయితే నాగర్ కర్నూల్ నీటి కొరత ప్రాంతం కావడంతో 600 చెట్లు ఎండిపోయాయి. మిగతా వాటికి ఎడ్లబండ్ల ద్వారా, ట్రాక్టర్ల ద్వారా నీటిని అందించామన్నారు. అయితే ఇవి కూడా 18 సంవత్సరాల తరువాత కల్లు గీసేందుకు రెడీ అయ్యాయని తెలుపుతున్నాడు. అయితే నీటి వసతి ఉంటే మాత్రం ఇంత సమయం పట్టేది కాదని ఆయన పేర్కొన్నాడు.
ముందుగా తాను చెట్లను పెడితే వ్యవసాయ భూమిలో చెట్లు ఎందుకు పెట్టావని ఎద్దేవా చేశారట. అయితే రాను రాను వారే ఇఫ్పుడు ఖర్జూర కల్లు కావాలని అడుగుతున్నారట. ప్రస్తుతం రోజుకు 20 చెట్ల నుంచి మార్చి మార్చి కల్లు గీస్తారట యాదయ్య. అలా తనకు అనుకున్నదాని కంటే రెట్టిపు ఆదాయం వస్తుందని అంటున్నాడు.
ఇటీవల కల్తీ మద్యంతో ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. బీర్లు, లిక్కర్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ సమయంలో ప్రభుత్వం ఖర్జూర చెట్లను పెట్టిస్తే కల్లును గీసేందుకు మార్గం ఏర్పడే అవకాశం ఉంటుందని అంటున్నారు. మరోవైపు ఖర్జూర కల్లులో ఆల్కహాల్ శాతం తక్కవే అయినందున ఆరోగ్యానికీ ఎలాంటి ప్రమాదం ఉండదంటున్నారు.
Comments are closed.