టాలీవుడ్ లో సెన్షేషనల్ దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రత్యేకం. పూరితో సినిమా చేయడానికి స్టార్ హీరోలు వెయిటింగ్ లో ఉన్నా.. పూరి మాత్రం ప్రస్తుతం సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేస్తోన్నాడు. ఇటీవలే ఈ సినిమా టైటిల్ ను ఫిక్స్ చేశారు. తమ సినిమా టైటిల్ ను ‘లైగర్’ (సాలా క్రాస్ బ్రీడ్) అని పూరి బృందం అధికారికంగా ప్రకటించారు.
ఇక ఈ చిత్రాన్ని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. అన్నట్టు ఈ చిత్రం ఓ డాన్ అతని కొడుకుకి మధ్య నడుస్తోందని.. డాన్ కొడుకుగా విజయ్ దేవరకొండ నటిస్తుండగా.. డాన్ గా బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కనిపించబోతున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. అయితే విజయ్ దేవరకొండ, సునీల్ శెట్టి కొడుకుగా కేవలం పదిహేను నిముషాల ప్లాష్ బ్యాక్ స్టోరీలో మాత్రమే కనిపిస్తాడని.. తండ్రికొడుకుల ఎమోషన్ చాలా బాగుంటుందని తెలుస్తోంది.విజయ్ సినిమాలో చాల భాగం తండ్రికి వ్యతిరేకంగా పని చేస్తుంటాడట. మరి ఈ తండ్రికొడుకుల ఎమోషన్ ఎలా ఉంటుందో చూడాలి.
ముఖ్యంగా విజయ్ దేవరకొండ తన లుక్ తో పాటు హెయిర్ స్టైల్ ను కూడా ఈ సినిమా కోసం పూర్తిగా మార్చాడు. అలాగే ఫైటర్ కోసం ప్రత్యేకంగా సిక్స్ ప్యాక్ కూడా చేశాడు. బాలీవుడ్ సినిమా చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండకు ఈ సినిమా రూపంలో ఆ అవకాశం రావడంతో తెగ కష్ట పడుతున్నాడు.
తాజాగా లైగర్ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించేందుకు చిత్రంయూనిట్ సిద్ధమైంది. ఈ మేరకు హీరోయిన్ అనన్యపాండే, నిర్మాతల్లో ఒకరైన చార్మి తాజాగా వీడియోలో ఈ విషయాన్ని పంచుకున్నారు. రేపు గురువారం ఉదయం 8.14 గంటలకు ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించబోతున్నట్లు చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.