
ఏపీలో జరుగుతున్న విగ్రహాల విధ్వంసం ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే పలు కేసులు నమోదు చేశారు. ప్రజల్లో విశ్వాసం పెంచేలా అన్ని చర్యలు చేపడుతున్నట్లు చెప్తున్నారు. మరోవైపు విగ్రహాల విధ్వంసంలో వెలుగుచూస్తున్న పలు అంశాలు పోలీసులకు కూడా షాకిచ్చేలా ఉన్నాయి. ఇప్పటికే విగ్రహాల విధ్వంసంపై రాష్ట్రంలో రాజకీయ విమర్శల వేడి పెరుగుతుండగా.. అసలు ఈ ఘటనల్లో రాజకీయ ప్రమేయం ఉన్నట్లు ఎక్కడా వెల్లడి కాలేదని పోలీసులు చెప్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పలు కేసుల్లో పురోగతి ఉందని పోలీసులు ప్రకటించారు. అయితే రాష్టంలో చోటు చేసుకున్న ఆలయాల ఘటనలను స్ధూలంగా గమనిస్తే ఇందులో రాజకీయ ప్రమేయం కనిపించడం లేదని తెలుస్తోంది. కేవలం నిధుల వేట కోసం సాగిస్తున్న అన్వేషణతో పాటు మద్యం మత్తులో జరిగిన ఘటనలే ఎక్కువగా ఉన్నట్లు పోలీసుల దర్యాప్తు చెబుతోంది.
రాష్ట్రంలో చోటు చేసుకున్న ఆలయాల ఘటనలపై నమోదు చేసిన కేసుల్లో ఆరు కేసులు మాత్రం ఆసక్తి రేపుతున్నాయి. ఇందులో విగ్రహాల విధ్వంసానికి కారణం నిధుల కోసం సాగుతున్న వేటతో పాటు మద్యం మత్తులో ఆలయాల్లో దూరి విధ్వంసాలకు పాల్పడిన ఘటనలు ఉండటమే. ఈ ఆరు కేసుల్లో ఇప్పటివరకూ 42 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రకాశం జిల్లా తాలుపాడు వీరభద్రస్వామి ఆలయం, చిత్తూరు జిల్లా శివాలయంలో నంది విగ్రహం ధ్వంసం, కర్నూలు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో జరిగిన విధ్వంసాలకూ ఈ కారణాలే ప్రధానంగా పోలీసులు తేల్చారు. ఇక్కడ నిధుల వేట కోసం పొరుగున ఉన్న కర్ణాటకతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ముఠాలు, స్ధానికంగా ఉన్న మందుబాబులే కారణమని నిర్ధారించి వీరిపై కేసులు నమోదు చేశారు.
అదే విధంగా ఓ పార్టీ గుండాలు కొంతమంది అధికార పార్టీ నాయకులపై బురదజల్లే ప్రయత్నమే అన్నట్టు అర్థమవుతోంది. పక్కా స్కెచ్ ప్రకారమే.. ప్రజల్లో అలజడి రేపేందుకు తెలుగుదేశం నాయకులు కుట్రపన్నినట్లు తెలుస్తోంది. కర్నూలు ఘటనలో మాజీ మంత్రి అనుచరుడు, రాజమండ్రిలో టీడీపీ నేత వ్యక్తిగత కార్యదర్శి , ఏటిగైరంపేట ఘటనలో టీడీపీ శ్రేణులకు టీడీపీ సీనియర్ నేత కొడుకు మద్దతు… ఇవన్నీ చూస్తుంటే.. టీడీపీ పథకం ప్రకారమే కుట్రపన్నినట్లు తెలుస్తోంది.
గత ఏడాది సెప్టెంబర్ 5న అంతర్వేది లక్మ్షీ నరసింహాస్వామి ఆలయానికి చెందిన రథం అగ్నికి ఆహుతి అయినప్పటి నుంచి రాష్ట్రంలోని ఇతర పార్టీలు అధికార వైసీపీపై కుట్ర పన్నుతూనే ఉన్నాయి. ప్రజల్లో ఉన్న దేవుడి సెంటిమెంటును అవకాశంగా తీసుకుని అలజడులకు ప్రయత్నించాయి. రాష్ట్రంలో దేవాలయాలకు సంబంధించి ఇప్పటి వరకు 44 కేసులు నమోదు చేశారు. వాటిలో 29 కేసులు ఛేదించిన పోలీసులు 81మందిని అరెస్ట్ చేశారు. వీటిల్లో తొమ్మది కేసుల్లో బీజేపీ, టీడీపీ నాయకుల ప్రమేయం ఉందని గుర్తించిన పోలీసులు 15మందిని అరెస్ట్ చేశారు. మొత్తంగా ప్రభుత్వం బురదజల్లే ప్రయత్నం ఇప్పటికైనా మానుకోవాలని పచ్చ, కాషాయ పార్టీలకు రాష్ట్ర ప్రజలు సూచిస్తున్నారు.