తూచ్.. పాత సంప్రదాయం కొనసాగిద్దామంటున్న టీఆర్ఎస్..!

చేతిలో అధికారంలో ఉంది కదా అని విర్రవీగితే ఏమవుతుందో టీఆర్ఎస్ కు ఇన్నాళ్లకు తెలిసొచ్చింది. తెలంగాణలో ఒంటెద్దు పొకడలతో వెళుతున్న టీఆర్ఎస్ సర్కార్ కు ప్రజలు ఇటీవల జరిగిన వరుస ఎన్నికల్లో కర్రకాల్చి వాతపెట్టారు. దీంతో సీఎం కేసీఆర్ దిద్దబాటు చర్యలు చేపడుతున్నారు. ఇటీవల దుబ్బాకలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతితో ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిపై బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు వెయ్యికి పైగా ఓట్లతో గెలుపొందాడు. ఆ తర్వాత జరిగిన […]

Written By: Neelambaram, Updated On : December 28, 2020 5:02 pm
Follow us on

చేతిలో అధికారంలో ఉంది కదా అని విర్రవీగితే ఏమవుతుందో టీఆర్ఎస్ కు ఇన్నాళ్లకు తెలిసొచ్చింది. తెలంగాణలో ఒంటెద్దు పొకడలతో వెళుతున్న టీఆర్ఎస్ సర్కార్ కు ప్రజలు ఇటీవల జరిగిన వరుస ఎన్నికల్లో కర్రకాల్చి వాతపెట్టారు. దీంతో సీఎం కేసీఆర్ దిద్దబాటు చర్యలు చేపడుతున్నారు.

ఇటీవల దుబ్బాకలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతితో ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిపై బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు వెయ్యికి పైగా ఓట్లతో గెలుపొందాడు. ఆ తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గతంలో కంటే తక్కువ సీట్లకు పరిమితమైంది. దీంతో తెలంగాణలో టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనే సంకేతాలు ప్రజల్లోకి బలంగా వెళుతున్నాయి.

నాగార్జున్ సాగర్లోనూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య మృతితో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే టీఆర్ఎస్ అప్పుడే ఓటమి భయం పట్టుకున్నట్లు కన్పిస్తోంది. నాగార్జున్ సాగర్ ఉప ఎన్నికపై టీఆర్ఎస్ నేత.. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి.

ప్రజాప్రతినిధులు ఎవరైనా చనిపోతే వారి కుటుంబాల్లోని వ్యక్తిని ఉపఎన్నికల్లో ఏకగ్రీవం చేసే సంప్రదాయం ఉందని.. దీనిని నాగార్జునసాగర్లో విపక్షాలు పాటించాలని గుత్తా సుఖేందర్ రెడ్డి కోరుతున్నారు. తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఉప ఎన్నికకు పోటీ అనివార్యమైనప్పటికీ టీఆర్ఎస్ మాత్రం ఓ ప్రయత్నం చేస్తుండం గమనార్హం.

గుత్తా చెప్పినట్లుగానే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు ఎవరైనా చనిపోతే వారి కుటుంబ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకునే సంప్రదాయం ఉంది. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. పాలెరులో వెంకటరెడ్డి.. నారాయణఖేఢ్‌లో పటోళ్ల కృష్ణారెడ్డి చనిపోయినప్పుడు ఉపఎన్నికలు వచ్చాయి.

కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను రంగంలోకి దింపి మరీ గెలిపించుకుంది. పాత సంప్రదాయాలను పాటించాలని అప్పట్లో విపక్ష నేతలు చెప్పినా లెక్క చేయలేదు. ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చనిపోతున్నారు. దుబ్బాకలో టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. దీంతో టీఆర్ఎస్ నేతలు తూచ్.. పాత సంప్రదాయాన్ని కొనసాగించాలని కోరుతున్నారు. దీనిపై ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయో వేచిచూడాల్సిందే..!