గులాబీ పార్టీకి ఈ ఏడాది ఏమైందో కానీ.. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వరుసగా మరణిస్తుండడం విషాదంగా మారింది. అంతకుమించిన విషాదం ఏంటంటే దుబ్బాక ఎమ్మెల్యే చనిపోయి అక్కడ ఉప ఎన్నిక జరిగితే బీజేపీ పరమైంది. ఇప్పుడు మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే మరణంతో మరో సారి ఉప ఎన్నిక అనివార్యమైంది. తెలంగాణపై దండయాత్ర చేసిన బీజేపీకి ఇదో ఆయాచిత వరమైంది.
Also Read: నేడు పోలింగ్.. నగర వాసుల తీర్పు ఎలా ఉండనుంది?
తెలంగాణ రాష్ట్ర సమితిలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆ పార్టీ నాయకుడు, నాటి కమ్యూనిస్టు దిగ్గజం, ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య కన్నుమూశారు. ఆయన వయస్సు 64 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో నోముల చికిత్స పొందుతున్నారు. మంగళవారం ఆరోగ్య పరిస్థితి విషమించి మరణించారు.
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఎమ్మెల్యే గా ఉన్న నోముల నర్సింహ్మయ్య మృతికి తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజల కోసం పనిచేసిన నోముల లేని బాధ తీర్చలేనిదన్నారు. హిమాయత్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉంటున్న ఆయన సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అనారోగ్యానికి గురయ్యారు. శ్వాసతీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వెంటనే అపోలో ఆస్పత్రికి తరలించగా తెల్లవారుజామున కన్నుమూశారు.
Also Read: జీహెచ్ఎంసీ అప్డేట్: పోలింగ్ ప్రారంభం.. ఓటర్ల బారులు
1956లో జన్మించిన నోముల ఎంపీపీగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. మొదట సీపీఎం పార్టీలో చేరి రెండు సార్లు నకిరేకల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. సీపీఎం శాసనసభాపక్ష నేతగా కొనసాగారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడిగా ఉన్నారు. తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీ క్రియాశీలక నేతగా గుర్తింపు పొందారు. వామపక్ష పోరాట ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. పార్టీ కేడర్ కు దిశానిర్ధేశం చేశారు.
తెలంగాణ ఆవిర్భవించిన తరువాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో నోముల సీపీఎంకు గుడ్ బై చెప్పారు. 2014లో గులాబీ కండువాను కప్పుకున్నారు. ఆ తరువాత 2018లో టీఆర్ఎస్ లోచేరి నాగార్జున సాగర్ నుంచి బరిలో దిగారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిపై గెలుపొందారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్