https://oktelugu.com/

చరిత్రదాచిన భారత యోధుడు ‘సుభాష్ చంద్రబోస్’

అజాద్ హింద్ ఫౌజ్ తో బ్రిటీషర్లపై యుద్ధం ప్రకటించి భారత స్వాతంత్ర్య సంగ్రామాన్ని మరో మలుపు తిప్పిన గొప్ప యోధుడు, భారత మాత ముద్దు బిడ్డ సుభాష్ చంద్రబోస్. గాంధీజీ లాంటి నేతలు నాడు అహింసా మార్గంతో వెళితే.. చంద్రబోస్ మాత్రం హింసా మార్గంలోనే భారత్ కు స్వాతంత్ర్యం కల్పించాలని పెద్ద సైన్యాన్నే తయారు చేసి బ్రిటీషర్లపై దండెత్తిన యోధుడు. ఈ రోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి. జనవరి 23, 1897 న ప్రభావతి దేవి-జానకీనాథ్ […]

Written By:
  • NARESH
  • , Updated On : January 23, 2021 / 10:09 AM IST
    Follow us on

    అజాద్ హింద్ ఫౌజ్ తో బ్రిటీషర్లపై యుద్ధం ప్రకటించి భారత స్వాతంత్ర్య సంగ్రామాన్ని మరో మలుపు తిప్పిన గొప్ప యోధుడు, భారత మాత ముద్దు బిడ్డ సుభాష్ చంద్రబోస్. గాంధీజీ లాంటి నేతలు నాడు అహింసా మార్గంతో వెళితే.. చంద్రబోస్ మాత్రం హింసా మార్గంలోనే భారత్ కు స్వాతంత్ర్యం కల్పించాలని పెద్ద సైన్యాన్నే తయారు చేసి బ్రిటీషర్లపై దండెత్తిన యోధుడు. ఈ రోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి. జనవరి 23, 1897 న ప్రభావతి దేవి-జానకీనాథ్ దంపతులకు ఒడిషాలోని కటక్ లో జన్మించిన నేతాజీ గొప్ప స్వాతంత్ర్య సమరయోధులు. నేతాజి తండ్రి ఓ న్యాయవాది..జాతీయవాది.

    ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తుంటే నేతాజీ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన మహనీయులు.

    చిన్నతనం నుంచే చురుగ్గా ఉండే నేతాజీ.. పరమహంస, స్వామి వివేకానందల ప్రభావంతో సన్యాసం స్వీకరించారు. దేశ సేవకు నడుం కట్టారు. జాతీయ కాంగ్రెస్ లో చేరారు. నేతాజీ రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా ఎన్నికైనా గాంధీజీతో సిద్ధాంత పరమైన అభిప్రాయ భేదాల వలన ఆ పదవికి రాజీనామా చేశారు. గాంధీజీ యొక్క అహింసావాదం మాత్రమే స్వాతంత్ర్య సాధనకు సరిపోదని, పోరుబాట కూడా ముఖ్యమని బోసు భావన. ఈ అభిప్రాయాలతోనే ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించారు.

    1920లో ఇండియన్ సివిల్ సర్వీసెస్ కు ఎంపికైన నేతాజి దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదులుకున్నాడు. ఉద్యమంలోకి దూకారు. దాదాపు 11 సార్లు ఆంగ్లేయులతో కారాగారంలో నిర్బంధించ బడ్డారు. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఆంగ్లేయులను దెబ్బ తీయటానికి దీన్ని ఒక సువర్ణవకాశంగా బోసు భావించారు. యుద్ధం ప్రారంభం కాగానే అయన ఆంగ్లేయుల పై పొరాడేందుకు కూటమి ఏర్పాటు చేసే ఉద్దేశంతో రష్యా, జర్మనీ మరియు జపాన్ దేశాలలో పర్యటించారు. జపాను సహాయంతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు మరియు ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యంను ఏర్పాటు చేశారు. జపాను ప్రభుత్వం అందించిన సైనిక, ఆర్థిక, దౌత్య సహకారాలతో ఆజాద్ హింద్ ప్రభుత్వంను సింగపూర్ లో ఏర్పాటు చేశాడు.

    18 ఆగస్టు, 1945 లో తైవాన్ లో జరిగిన విమాన ప్రమాదంలో బోసు మరిణించారని ప్రకటించినప్పటికి, ఆయన ప్రమాదం నుంచి బయట పడి అజ్ఞాతం లోకి వెళ్ళారని పలువురు నమ్ముతారు. అయితే ఆయన మరణంపై నేటికి వివాదం కొనసాగుతూనే ఉంది.

    నేతాజా మరణానికి సంబంధించిన వంద సీక్రెట్ ఫైళ్లను విడుదల చేసినప్పటికీ ఆయన మరణం వెనుక కారణాలు ఇప్పటికీ ప్రపంచానికి ఓ మిస్టరీలాగానే మిగిలిపోయింది.

    కాగా భారత స్వాతంత్ర్య సంగ్రామాన్ని మలుపుతిప్పిన నేతాజీ చంద్రబోస్ కు భారత ప్రభుత్వం తాజాగా అరుదైన గౌరవం కల్పించింది. ఆయన పుట్టినరోజైన జనవరి 23న ‘పరాక్రమ్ దివస్’ గా జరపాలని నిర్ణయించింది. ఈ ఏడాది జనవరి 23న నేతాజీ 125వ జయంతిని పురస్కరించుకొని భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నేతాజీ జయంతిని ఏటా పరాక్రమ్ దివస్ గా నిర్వహించాలని కేంద్రం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.