
దేశంలో బంగారం రేటు ఆకాశాన్నంటున్న సంగతి తెలిసిందే. 10 గ్రాముల బంగారం ధర 50,000 రూపాయలకు పైగా పలుకుతుండటంతో బంగారం కొనుగోలు చేయాలా.. ? వద్దా? అనే ఆలోచన చాలామందికి వేధిస్తోంది. అయితే బంగారం కొనుగోలు చేసేముందు కొన్ని విషయాల గురించి తప్పనిసరిగా అవగాహన ఉండాలి. అవగాహన లేకుండా బంగారం కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తే నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
బంగారం కొనుగోలు చేయాలంటే మొదట బంగారం స్వచ్చత గురించి అవగాహన ఉండాలి. బంగారం ప్రియులకు నచ్చిన ప్యూరిటీతో బంగారం కొనుగోలు చేసే అవకాశం ఉంది. అయితే చాలామంది 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం కొనుగోలు చేయడానికే ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే బంగారం ప్యూరిటీని ఏ విధంగా తెలుసుకోవాలనే సందేహం చాలామందిని వేధిస్తూ ఉంటుంది. బీఐఎస్ హాల్‌మార్క్ ద్వారా బంగారం ప్యూరిటీని తెలుసుకోవచ్చు.
బంగారం కొనుగోలు చేసే సమయంలో హాల్ మార్క్ ఉన్న బంగారం కొనుగోలు చేస్తే మంచిది. కేంద్ర ప్రభుత్వం బంగారం యొక్క స్వచ్చత ఆధారంగా హాల్ మార్క్ ను ముద్రిస్తుంది. అందువల్ల హాల్ మార్క్ ను పరిశీలించి బంగారాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. బంగారం ఆభరణాల తయారీ కోసం సాధారణంగా 22 క్యారెట్ల బంగారాన్ని ఎక్కువగా వినియోగిస్తారు.
22k916 అనే హాల్ మార్క్ 22 క్యారెట్లతో తయారు చేసిన బంగారానికి ఉంటుంది. 18 క్యారెట్ల బంగారానికి 18k750 హాల్ మార్కింగ్ 14 క్యారెట్ల బంగారానికి 14k585 హాల్ మార్క్ ఉంటుంది. బంగారం కొనుగోలు చేసిన సమయంలో తప్పనిసరిగా బిల్లును తీసుకోవాలి.