
ఏపీ సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసి ఆ దిశగా విశాఖను పరిపాలన రాజధానిగా చేయడానికి వడివడిగా ముందుకెళుతున్నారు. ఈ క్రమంలోనే ప్రతిపక్ష టీడీపీ ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ కోర్టుల్లో, బయటా పోరాడుతోంది. కేంద్రంలోని బీజేపీ ఇప్పటికే జగన్ మూడు రాజధానులకు అనుకూలంగా ఉండగా.. ఏపీ రాష్ట్ర బీజేపీ శాఖ మాత్రం వ్యతిరేకిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
ఏపీ రాజధాని అమరావతిలోనే ఉండాలని.. ఇందులో మరో ఆలోచన లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తూళ్లూరులో జరిగిన కిసాన్ సంఘ్ సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనమయ్యాయి.
రాజధానిలో జరిగే అభివృద్ధి అంతా ప్రధాని మోడీ చేయిస్తున్నాదని.. రాష్ట్ర ప్రభుత్వం రాజధానులు మార్చినా కేంద్ర సంస్థలు అమరావతిలోనే ఉంటాయని వీర్రాజు బాంబు పేల్చారు.
ఈ సందర్భంగా సోము వీర్రాజు స్పష్టమైన ప్రకటన చేశారు. ప్రధాని మోడీ ప్రతినిధిగా హామీ ఇస్తున్నానని.. అమరావతిలోనే అద్భుత రాజధానిని బీజేపీ నిర్మించి ఇస్తుందని అన్నారు. అమరావతి రైతులకు ఇచ్చిన ప్లాట్లన్నింటిని రూ.2వేల కోట్లతో బీజేపీ అభివృద్ధి చేస్తుందన్నారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేరాలంటే బీజేపీని రాష్ట్రంలో గెలిపించాలని పిలుపునిచ్చారు.