పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సుజాతా మొండల్ ఖాన్ హాట్ టాపిక్ గా మారుతున్నారు. బీజేపీ ఎంపీ సౌమిత్రా ఖాన్ భార్య సుజాతా మొండల్ ఖాన్ ఇటీవలే ఆ పార్టీకి రాజీనామాచేసి తృణముల్ కాంగ్రెస్ లో చేరారు.
దీనిపై బీజేపీ సౌమిత్రా ఖాన్ స్పందిస్తూ ఆమె తృణమూల్ కాంగ్రెస్ లో చేరడం వెనుక తన ప్రమేయం లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఆమెకు విడాకులు ఇస్తానంటూ ప్రకటించడం సంచలనంగా మారింది.
సౌమిత్రా ఖాన్ వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోని సుజాతా మొండల్ ఖాన్ తృణమూల్ కాంగ్రెస్ లో మాత్రం యాక్టివ్ గా కొనసాగుతున్నారు. తాజాగా ఆమె బీజేపీ నేత సువేందు అధికారికి ఛాలెంజ్ విసరడం పశ్చిమ బెంగాల్లో ఆసక్తిని రేపుతోంది.
టీఎంసీ నుంచి ఇటీవల బీజేపీలో చేరిన సువేందు అధికారి బెంగాల్లోని 294 అసెంబ్లీ స్థానాల్లో ఎక్కడి నుంచి పోటీ చేసినా డిపాజిట్లు కూడా రాకుండా చేస్తానని సుజాతా మొండల్ ఖాన్ సవాల్ విసిరారు.
సువేందు అధికారి తన సవాల్ ను స్వీకరించకపోతే భయపడినట్లేనని ఆమె వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే తృణమూల్ కాంగ్రెస్ లో చేరిన మొండల్ పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారుతున్నారు.