https://oktelugu.com/

‘ఉక్కు’ద్రవం మొదలైంది

అది 1966 నవంబర్ ఒకటో తేదీ. విశాఖపట్నంలో ప్రదర్శన చేస్తున్న నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ముగ్గురు విద్యార్థులు, మరో ఆరుగురు వ్యక్తులు మరణించారు. ఆ రోజు విశాఖతోపాటు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు కాల్పుల్లో మొత్తం 32 మంది చనిపోయారు. 50 ఏండ్ల కిందట ‘విశాఖ ఉక్కు ..-ఆంధ్రుల హక్కు’ నినాదంతో చేపట్టిన ఉద్యమంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. ఆ తర్వాత మూడేళ్లకు కేంద్ర ప్రభుత్వం కర్మాగారం ఏర్పాటును ప్రకటించింది. 1971లో శంకుస్థాపన చేస్తే.. రెండు […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 6, 2021 3:39 pm
    Follow us on

    అది 1966 నవంబర్ ఒకటో తేదీ. విశాఖపట్నంలో ప్రదర్శన చేస్తున్న నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ముగ్గురు విద్యార్థులు, మరో ఆరుగురు వ్యక్తులు మరణించారు. ఆ రోజు విశాఖతోపాటు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు కాల్పుల్లో మొత్తం 32 మంది చనిపోయారు. 50 ఏండ్ల కిందట ‘విశాఖ ఉక్కు ..-ఆంధ్రుల హక్కు’ నినాదంతో చేపట్టిన ఉద్యమంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. ఆ తర్వాత మూడేళ్లకు కేంద్ర ప్రభుత్వం కర్మాగారం ఏర్పాటును ప్రకటించింది. 1971లో శంకుస్థాపన చేస్తే.. రెండు దశాబ్దాల తర్వాత పూర్తిస్థాయి పని ప్రారంభించింది. శంకుస్థాపన జరిగి 2021కి 50 ఏళ్లు పూర్తి కాగా ఇప్పుడు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేగమవుతున్నాయి. ప్రైవేటీకరణ యత్నాలపై విమర్శలు, వ్యతిరేకత వ్యక్తమవుతున్నాయి.

    ఉక్కు ఉద్యమాన్ని ఒకసారి పరిశీలిస్తే..
    1966 అంటే.. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇరవై ఏళ్లు కూడా కాలేదు. దాదాపు వంద కోట్ల మంది జనాభా ఉన్న దేశం పారిశ్రామికంగా వేగంగా పురోగతి సాధించటం, ఆర్థికాభివృద్ధి చారిత్రక అవసరం. మరోవైపు రాజకీయంగా కూడా పరిస్థితులు అస్థిరంగా ఉన్నాయి. మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌నెహ్రూ 1964 మేలో చనిపోయారు. ఆయన తర్వాత ప్రధాని అయిన లాల్‌బహదూర్‌శాస్త్రి 1966 జనవరిలో ఆకస్మాత్తుగా చనిపోయారు. ఆ సందర్భంగా నెలకొన్న రాజకీయ సమీకరణల్లో ఇందిరాగాంధీని ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు. ఇందిర హయాంలో మొదట కొన్ని నెలల పాటు దేశంలో అశాంతి, అసంతృప్తి, ఆందోళనలు తీవ్రమయ్యాయి. వరుసగా రెండు సీజన్లు దారుణంగా ఉండటంతో ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. పెరుగుతున్న ధరలు, ఆహార కొరతతోపాటు.. బిహార్ సహా పలు ప్రాంతాల్లో కరువు లాంటి పరిస్థితులు నెలకొన్నాయి. బంద్‌లు, ఘెరావ్‌లు, సమ్మెలు, ప్రజల సామూహిక నిరసనలు, మూకుమ్మడి ఆందోళనలు పెరుగుతూ ఉన్నాయి.

    Also Read: సీఎంపై తుది నిర్ణయం జేపీ నడ్డా, పవన్ కళ్యాణ్ లదేనా?

    1967లో సాధారణ ఎన్నికలకు సమాయత్తం
    1967.. అది ఎన్నికల సంవత్సరం. సాధారణ ఎన్నికల కోసం అన్ని రాజకీయ వర్గాలూ సమాయత్తమవుతున్నాయి. జనంలో బలపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అదే సమయంలో.. కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌లో అటు దిల్లీలోనూ ఇటు రాష్ట్రంలోనూ అంతర్గతంగా ఆధిపత్య పోరు కూడా సాగుతోంది. ఇంకోవైపు.. ఆంధ్రప్రదేశ్ కూడా ఒడిదొడుకులతో సాగుతోంది. మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత.. మద్రాసు నగరాన్ని కోల్పోయామన్న అసంతృప్తి ప్రజల మనసునుంచి చెరిగిపోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడి అప్పటికి పదేళ్లే అయ్యాయి. పారిశ్రామిక ప్రగతితోనే ఆర్థిక ప్రగతి సాధ్యమని అప్పుడప్పుడే ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. కానీ మొదటి మూడు పంచవర్ష ప్రణాళికల్లో.. ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందని, ప్రభుత్వ పెట్టుబడులతో సరైన పరిశ్రమలు ఏవీ దక్కలేదని జనంలో అసంతృప్తి ఉంది. ఈ పరిస్థితుల్లో నాలుగో పంచవర్ష ప్రణాళికలో అదనంగా రెండు ఉక్కు కర్మాగారాలను ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అప్పటికే ఉత్తర భారతదేశంలో రూర్కెలా(ఒడిశా), భిలాయ్(మధ్యప్రదేశ్), అసన్‌సోల్ (పశ్చిమబెంగాల్)లలో మూడు కర్మాగారాలు ఏర్పాటయ్యాయి. భిలాయ్ ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఉంది.

    ఐదో ప్లాంట్‌ దక్షిణభారతంలో..
    కొత్తగా స్థాపించే స్టీల్ ప్లాంట్లలో నాలుగోది బొకారో(బిహార్)లో నెలకొల్పాలని నిర్ణయించారు. బొకారో ప్రస్తుతం ఝార్ఖండ్‌లో ఉంది. ఐదో కర్మాగారాన్ని దక్షిణ భారతదేశంలో ఏర్పాటు చేయాలన్నది ఆలోచన. 1964 శీతాకాల సమావేశాల్లో ఆ ప్రణాళిక ముసాయిదాపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చర్చ జరిగినపుడు.. ‘పరిశ్రమల విషయంలో మొదటి మూడు పంచవర్ష ప్రణాళికల్లో రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని సరిచేయటానికి.. ప్రతిపాదిత ఉక్కు కర్మాగారాన్ని ఆంధ్రప్రదేశ్‌లోనే నెలకొల్పాలి. అలా నెలకొల్పే వరకూ అసమతుల్యత తొలగిపోదు. రాష్ట్రాన్ని ఇంకా నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు’ అని అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. ఈ డిమాండ్‌కు అప్పటి ప్రతిపక్ష పార్టీ నాయకులు పి.వెంకటేశ్వర్లు (సీపీఐ), టి.నాగిరెడ్డి (సీపీఎం), జి.లచ్చన్న (స్వరాజ్య), తెన్నేటి విశ్వనాథం (నేషనల్ డెమొక్రాట్స్), వావిలాల గోపాల కృష్ణయ్య(ఇండిపెండెంట్) తదితరులు మద్దతిచ్చారు.

    వ్యతిరేకంగా హిందుస్తాన్‌ స్టీల్‌ నివేదిక
    మరోవైపు.. ఐదో ఉక్కు పరిశ్రమ స్థాపన అధ్యయనం మీద మొదట హిందుస్తాన్ స్టీల్ ఇచ్చిన నివేదిక.. విశాఖపట్నానికి అనుకూలంగా లేదు. అప్పుడు కేంద్రంలో ఉక్కుశాఖ మంత్రిగా నీలం సంజీవరెడ్డి ఉన్నారు. ఆయన 1965 జనవరి 27న బ్రిటిష్ అమెరికన్ స్టీల్ వర్క్స్ ఫర్ ఇండియా కన్సార్షియం (బీఏఎస్ఐసీ – బేసిక్) పేరుతో ఒక సాంకేతిక నిపుణుల బృందాన్ని నియమించారు. ఉక్కు పరిశ్రమను స్థాపించటానికి అనువైన ప్రదేశం గురించి నిష్పాక్షిక నిపుణుల అభిప్రాయం తెలుసుకోవటం ఆ కన్సార్షియం ఏర్పాటు లక్ష్యం. ఇది ఆరు వేర్వేరు స్థలాలు విశాఖపట్నం, బైలదిలా, గోవా, హోస్పేట్, సేలం, నైవేలీలను పరిశీలించింది. ఆ బృందం 1965 జూన్ 25వ తేదీన నివేదిక సమర్పించింది. దక్షిణ భారతదేశంలో ఉక్కు పరిశ్రమ స్థాపనకు సముద్ర తీరంలో అత్యంత అనుకూలమైన ప్రదేశం విశాఖపట్నమని తేల్చింది. ఓడరేవు కూడా కలిగి ఉన్న విశాఖపట్నం అన్నివిధాలా అనువైన ప్రాంతమని స్పష్టంచేసింది. అప్పటికే రెండు మూడేళ్ల నుంచి విశాఖలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై చర్చ జరుగుతుండటంతో ప్రజల్లో దీనిపై అంచనాలు పెరిగాయి. ఒక భారీ కర్మాగారం ఏర్పాటైతే లభించే ఉపాధి అవకాశాలు, ఆర్థికాభివృద్ధి గురించిన ఆశలు మొలకెత్తాయి. కన్సార్షియం నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నంలోనే ఉక్కు కర్మాగారం స్థాపిస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రజలు సహజంగా భావించారు.

    పీఎం లాల్‌బహదూర్‌‌ సైతం హామీ
    నాడు ప్రధానమంత్రిగా ఉన్న లాల్‌బహదూర్‌ శాస్త్రి సైతం విశాఖలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ.. ప్లాంటు ఏర్పాటు గురించి ప్రకటన చేయటంలో జాప్యం ప్రజల్లో అపోహలకు, అసంతృప్తులకు, ఆందోళనలకు దారితీసింది. ఈ పరిణామాల మధ్య 1966 జనవరిలో లాల్‌బహదూర్‌శాస్త్రి ఆకస్మికంగా చనిపోయారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయ్యారు. ప్లాంటు ఏర్పాటు ముందుకు వెళ్లలేదు. దీంతో విశాఖపట్నంలో స్టీల్ ప్లాంటును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 1965న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆ తీర్మానాన్ని సీఎం బ్రహ్మానందరెడ్డి స్వయంగా ప్రవేశపెట్టారు. ‘ఐదో స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేసే ప్రాంతం గురించిన ప్రకటనలో జాప్యం మీద ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో నెలకొన్న తీవ్ర ఆందోళనను అత్యవసరంగా గుర్తించాలి’ అని అందులో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అయితే.. నాలుగో పంచవర్ష ప్రణాళికలో భాగంగా.. ఐదో ఉక్కు కర్మాగారం నెలకొల్పటం సాధ్యం కాదని ఇందిరాగాంధీ సెప్టెంబరులో పేర్కొన్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఆందోళన తీవ్రమైంది. ఉక్కు కర్మాగారాన్ని తమిళనాడుకో, కర్ణాటకకో తరలిస్తారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. మరోసారి అన్యాయానికి గురవుతున్నామన్న ఆవేదన తలెత్తింది. ఈ క్రమంలో నీలం సంజీవరెడ్డిని ఉక్కు శాఖ నుంచి పర్యాటక, విమానయాన శాఖకు బదిలీ చేశారు ఇందిర. ఉక్కు శాఖ మంత్రిగా టి.ఎన్.సింగ్ నియమితులయ్యారు.

    Also Read: మోడీ హయాంలో మీడియా ప్రమాదంలో పడుతుందా..?

    ఆమరణ నిరాహార దీక్ష..-పోలీసు కాల్పులు
    1966 అక్టోబర్, నవంబర్ నెలల్లో ఉద్యమం బలపడింది. ‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ నినాదంతో ప్రజలు ఉద్యమించారు. గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన టి.అమృతరావు 1966 అక్టోబరు 15న విశాఖపట్నంలో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. కొద్ది రోజులకే కాలేజీలు, స్కూళ్ల విద్యార్థులు ఉద్యమంలోకి వచ్చి ముందు వరుసలో నిలుచున్నారు. వారికి రాజకీయ పార్టీలు మద్దతుగా నిలిచాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ప్రారంభించారు. దశల వారీగా తరగతుల బహిష్కరణ, బంద్‌లు, హర్తాళ్లు, సభలు, సమ్మెలు, నిరాహార దీక్షలు సాగాయి. అన్ని రాజకీయ పక్షాలతో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో తెన్నేటి విశ్వనాథం, యం.వి.భద్రం, రావిశాస్త్రి తదితరులు ప్రసంగించారు. 1966 నవంబర్ 1న విశాఖపట్నంలో విద్యార్థులు భారీ ప్రదర్శన చేపట్టారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు చేసిన ప్రయత్నం విఫలం కావడంతో పోలీసులు కాల్పులు జరిపారు. తొమ్మిదేళ్ల బాలుడు కె.బాబూరావు సహా తొమ్మిది మంది చనిపోయారు. వారిలో ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. దీంతో ఉద్యమం ఉగ్రరూపం దాల్చింది. విజయవాడలో ఆందోళన చేస్తున్న విద్యార్థులు నీలం సంజీవరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసి ఏలూరు కాలువలో పడేశారు. ఆందోళనకారులపై పోలీసుల కాల్పుల్లో.. తగరపువలసలో ఒకరు, ఆదిలాబాద్‌లో ఒకరు, విజయవాడలో ఐదుగురు, విజయనగరంలో ఇద్దరు, కాకినాడలో ఒకరు, వరంగల్‌లో ఒకరు, సీలేరులో ఒకరు, గుంటూరులో ఐదుగురు చనిపోయారు. మొత్తం మీద విశాఖతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా 32 మంది ప్రాణాలు కోల్పోయారు.

    మంత్రివర్గ ఉపసంఘం హామీ
    ఈ పరిణామాలతో కేంద్ర ప్రభుత్వం ఉక్కు కర్మాగారం అంశంపై పరిశీలనకు కేంద్ర మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గదని ప్రధాని ఇందిరాగాంధీ తనను కలిసేందుకు వచ్చిన రాష్ట్ర ఎంపీల బృందానికి తేల్చిచెప్పారు. 1966 నవంబర్ 3న ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన సీఎం బ్రహ్మానందరెడ్డి.. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు విషయం తెలిపి.. రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రం సరేనందని చెప్పి.. అమృతరావుకు నిమ్మరసం ఇచ్చి నిరాహార దీక్ష విరమింపజేశారు. దీంతో ఉద్యమం సద్దుమణిగింది. అయితే.. ఉద్యమాన్ని చల్లార్చటానికి కేంద్రం ఈ ‘మంత్రివర్గ ఉపసంఘా’న్ని తెరపైకి తెచ్చిందన్న విమర్శలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోదని స్పష్టమయ్యాక.. ఉద్యమాన్ని కొనసాగించాలని ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించాయి. కానీ.. ఆ ఉద్యమం బలంగా సాగలేదు.

    మూడేళ్లకు స్టీల్ ప్లాంట్ ప్రకటన
    ఉద్యమం తర్వాత మూడేళ్లకు అంటే 1970 ఏప్రిల్ 17న విశాఖలో స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పార్లమెంటులో ప్రధాని ఇందిరాగాంధీ ప్రకటన చేశారు. ప్లాంటు కోసం కురుపాం జమీందారులు 6,000 ఎకరాల స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. ఆ మరుసటి ఏడాది 1971 జనవరి 20న ప్లాంటు నిర్మాణానికి ఇందిర శంకుస్థాపన చేశారు. డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) తయారీ బాధ్యతను మెస్సర్స్ ఎం.ఎన్.దస్తూర్‌ అండ్ కో సంస్థకు అప్పగించారు. ఆ సంస్థ 1977 అక్టోబర్‌లో తన నివేదిక ఇచ్చింది. 1977లో జనతా ప్రభుత్వం హయాంలో రూ.1,000 కోట్లు మంజూరు చేయటంతో పనులు మొదలయ్యాయి. మరో రెండేళ్లకు పూర్తిస్థాయిలో పని ప్రారంభించింది. ప్రస్తుతం ఈ ప్లాంటు 26,000 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీని సామర్థ్యం ఏటా 7.3 మిలియన్‌ టన్నులు. దాదాపు 16,000 మంది శాశ్వత ఉద్యోగులు, 17,500 మంది కాంట్రాక్ట్‌ కార్మికులు పనిచేస్తున్నారు. పరోక్షంగా మరో లక్ష మంది ఉపాధి పొందుతున్నారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    ఇప్పుడు మరో పోరాటం..
    ‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ అన్న నినాదానికి ఉన్న పవర్ ఉత్తరాది వారికి ఈనాటి తరానికి తెలియకపోవచ్చు కానీ.. సౌతిండియా మొత్తం ఒకనాడు మారుమోగిన పవర్ ఫుల్ స్లోగన్ అంది. అందుకే ఏమీ కాకుండా చాలా సైలెంట్‌గా విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేస్తున్నామంటూ కేంద్ర పెద్దలు తాంబూలాలిచ్చేశారు. ప్రత్యేక హోదా మాదిరిగానే దీన్ని కూడా ఎవరూ పట్టించుకోరు.. వీధుల్లోకి రారు అన్న ధీమాతో కేంద్రం ఇష్టంవచ్చినట్లుగా నిర్ణయం తీసుకుంది. దీంతో విశాఖ ఒక్కసారిగా భగ్గుమంది. విశాఖలో ఉక్కు మంట పెద్ద ఎత్తున రాజుకుంది. విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేస్తే చూస్తూ ఊరుకోబోమని అన్ని పార్టీలు ముక్తకంఠంతో నినదించాయి. కామ్రెడ్స్ అయితే కదం తొక్కి మరీ కేంద్రంతో అమీ తుమీ తేల్చుకుంటామని హెచ్చరిస్తున్నాయి. విశాఖ ఉక్కు అంటే మీకు పరిశ్రమ మాత్రమే కావచ్చు. కానీ అది అఖిల‌ ఆంధ్రుల సెంటిమెంట్. ఆ మంటను రాజేస్తే రైతు ఉద్యమం కంటే అతి పెద్దదే దక్షిణాదిన వచ్చి తీరుతుంది అంటున్నారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. లోక్ సభలో విశాఖ ఉక్కు ప్రైవేట్ చేయడంపైన ప్రభుత్వాన్ని నిలదీస్తామని, ప్రజల పక్షాన నిలబడతామని, అక్కడే అన్నీ తేల్చుకుంటామని వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ స్పష్టం చేశారు. ఇతర వైసీపీ ఎంపీలు పార్లమెంట్ లో వైసీపీ గళం విప్పుతామని గట్టిగానే గర్జిస్తున్నారు. విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయడం బీజేపీ తరం కాదని సీపీఎం నేత సీహెచ్ నరసింగరావు అంటున్నారు. ఇక బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ సైతం విశాఖ ఉక్కుని కాపాడాలంటూ అర్జంటుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు వినతిపత్రం ఇవ్వడం ఈ మంటలు రాజేసిన సెగలే కారణమని వేరే చెప్పనక్కరలేదు. మొత్తానికి ఉత్తరాదిన రైతు ఉద్యమం చాలదా ఇపుడు.. ఉక్కు పేరిట మరో ఉద్యమాన్ని రాజేయాలా అని బీజేపీ పెద్దల మీద గట్టిగానే ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి.