సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలు దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లోనే పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని తమ బాధను వ్యక్తపరుస్తూ ఉంటారు. అయితే కేంద్రం మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించకపోగా భారీగా పెంచే దిశగా అడుగులు వేస్తోందని తెలుస్తోంది. త్వరలో పెట్రోల్, డీజిల్ పై 3 నుంచి 6 రూపాయల ఎక్సైజ్ సుంకం పెరిగే అవకాశాలున్నాయని సమాచారం.
కేంద్ర ప్రభుత్వం కరోనా సంక్షోభం కారణంగా కొన్ని వేల కోట్ల రూపాయలు నష్టపోయింది. కేంద్రానికి గతేడాదితో పోలిస్తే ఆదాయం భారీగా తగ్గింది. అయితే ఆదాయం తగ్గినా కరోనా, లాక్ డౌన్ వల్ల నష్టపోయిన పేద ప్రజలకు ప్రయోజనం చేకూరేలా కేంద్రం అనేక హామీలు ఇచ్చింది. ఈ హామీలను సక్రమంగా అమలు చేయాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం మాత్రమే మార్గమని ఈ నిర్ణయం ద్వారా సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయలు ఆదాయం చేకూరుతుందని కేంద్రం భావిస్తోంది.
అతి త్వరలోనే ఈ నిర్ణయం అమలులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచితే మాత్రం సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఇదే సరైన నిర్ణయం అని కేంద్రం భావిస్తోంది.
బీహార్ ఎన్నికల నేపథ్యంలో తాత్కాలికంగా ఈ నిర్ణయం అమలు వాయిదా పడుతోందని.. పోలింగ్ తరువాత ఇంధన ధరల పెంపుపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పడుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం మాత్రం పన్నులను పెంచే దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం.