
బాలీవుడ్ లో షారూక్ ఖాన్ రేంజ్ ఏంటన్నది అందరికీ తెలిసిందే. బాలీవుడ్ బాద్షాగా బాక్సాఫీస్ సింహాసనంపై ఠీవీగా కూర్చునే కెపాసిటీ ఖాన్ సొంతం. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అదేవిధంగా ఉంటుంది. అయితే.. కొన్నేళ్లుగా సరైన హిట్ పడట్లేదు. చేసిన ప్రతీసినిమా ఫ్లాప్ టాక్ తోనే బాక్సాఫీస్ రేస్ నుంచి తప్పుకుంటూ రావడంతో.. షారూక్ క్రేజ్ పై దుమ్ము పేరుకుపోయింది.
అయితే.. అప్ కమింగ్ మూవీ పఠాన్ ద్వారా ఆ దుమ్మును దులిపేయడంతోపాటు.. మళ్లీ బాక్సాఫీస్ బాద్షా అనే టైటిల్ ను సగర్వంగా మెళ్లో వేసుకుంటాడనే ప్రచారం సాగుతోంది. ఈ సినిమాకు వస్తున్న హైప్, జరుగుతున్న బిజినెస్ ఆ విషయాన్ని చెబుతుండగా.. ఇప్పుడు మరోవార్త ఇండియన్ సినిమానే షేక్ చేస్తోంది.
ఈ సినిమాకు షారూక్.. ఏకంగా రూ.100 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడట. ఇప్పటి వరకూ ఏ హీరో కూడా ఈ మార్కును అఫీషియల్ గా అందుకోలేదు. సల్మాన్, అక్షయ్ కుమార్ లాంటి హీరోలు.. సినిమా లాభాల్లో వాటా తీసుకోవడం ద్వారా రూ.వంద కోట్లను అందుకుంటారనే ప్రచారం ఉంది. కానీ.. పారితోషికం ద్వారానే రూ.100 కోట్లు తీసుకోవడం అనేది ఇప్పటి వరకూ జరగలేదు.
ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సిద్దార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్నారు. ‘వార్’ సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఈ దర్శకుడు.. షారూక్ ను డైరెక్ట్ చేస్తుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది. జాన్ అబ్రహం ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. మరి, ఎన్నోసంచలనాలకు కేంద్రమవుతున్న ఈ చిత్రం ఎలాంటి విజయం నమోదు చేస్తుందో చూడాలి.