
ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడించిన టీమిండియాకు ఆ గెలుపు ఆనందాన్ని కొద్దిరోజులు కూడా ఉంచలేదు ఇంగ్లండ్ జట్టు. సొంతగడ్డపై భారత్ ను ఓడించి గట్టి షాక్ ఇచ్చింది. దిగ్గజ ఆటగాళ్లతో దిగిన ఇండియా కూడా తేలిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోవడం లేదు.
ఇప్పుడు రేపటి నుంచి రెండో టెస్ట్ అదే చెన్నైలో ఆరంభం కాబోతోంది. దీంతో టీమిండియా సర్దుకుంటుందా? గెలుస్తుందా అన్న ఉత్కంఠ అభిమానులను వేధిస్తోంది. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే భారత్ జట్టుకు ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ కు చేరుకునే రేసులో ఉంటుంది. ఓడిపోతే ఇంగ్లండ్ డైరెక్టుగా చాంపియన్ షిప్ కు అర్హత సాధిస్తుంది.
కాగా రెండో టెస్టుకు భారత్ స్పిన్ పిచ్ ను తయారు చేసినట్టు తెలుస్తోంది. ఇంగ్లండ్ ను తిప్పేయడానికి చూస్తోంది. ఇంగ్లండ్ చాలా మార్పులను రెండో టెస్టుకు చేస్తోంది. అండర్సన్ బదులు సువార్ట్ బ్రాడ్ ను, కీపర్ బట్లర్ కు బదులు బెన్ ఫోక్స్ ను ఆడిస్తోంది. డామ్ బెస్ స్థానాన్ని మెయిన్ అలీ తీసుకుంటున్నాడు. జోఫ్రా అర్చర్ కు బదులు క్రిస్ వోక్స్ వస్తున్నాడు.
ఇక ఓడిపోయిన భారత జట్టులో కూడా మార్పులు జరుగుతున్నాయి. అక్షర పటేల్ , హార్ధిక్ పాండ్యాను తీసుకోవచ్చని అంటున్నారు. స్పిన్ పిచ్ కావడంతో మరో స్పెషలిస్ట్ పేసర్ బదులు అతడి సేవలు వినియోగించుకోవాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది. స్పిన్ లో భారీ సిక్సర్లు బాదే హార్ధిక్ ఉంటే మేలని టీమిండియా భావిస్తోంది. కుల్ దీప్ ఎంపికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
ఇక ఓపెనర్లు రోహిత్, గిల్ తోపాటు మిడిల్ ఆర్డర్ లో రహానే రాణించడం జట్టుకు కీలకం, పంత్, పూజారా ఫామ్ లోనే ఉన్నారు. అంతా రాణిస్తే ఇంగ్లండ్ ఆటకట్టడం ఈజీనే. రేపు ఏం జరుగుతుందనేది వేచిచూడాలి.