
రాష్ట్రంలో రెండోవిడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. 13 జిల్లాలలోని 20 రెవెన్యూ డివిజన్లు.. 175 మండలాల్లో రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఆయా డివిజన్లలో 3,335 పంచాయతీలు.. 33632 వార్డులకు ఎన్నికలు నిర్వహించనుంది ఎలక్షన్ కమిషన్. రెండో విడత పోలింగ్ తేదీని నెల 13గా ఖరారు చేశారు. మంగళవారం ఉదయం పదిన్నరకు ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ రెండురోజుల పాటు కొనసాగుతుంది. 4వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. ఐదవ తేదీన నామినేషన్ల పరిశీలన.. ఆరున అభ్యంతరాల పరిశీలన ఉంటుంది. ఏడవ తేదీన అభ్యంతరాలపై తుది నిర్ణయం తీసుకుంటారు. నామినేషన్లు ఉపసంహరించుకోవానికి తుది గడువు.. 8వ తేదీ. 13న రెండో విడత ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. అదే రోజు ఫలితాలు ప్రకటించి.. ఆ వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియను చెపడతారు.
చివరి రెండు విడతల్లో అంటే.. ఈనెల 17,21వ తేదీల్లో నిర్వహించే పోలింగ్ కోసం ఎన్నికల ప్రక్రియ త్వరలోనే ప్రారంభం అవుతుంది. తొలివిడతలో అంచనాలకు మించి నామినేషన్లు దాఖలు అయ్యాయి. సర్పంచ్, వార్డు సభ్యుల కోసం వేలసంఖ్యలో నామినేషన్లు వేశారు. ఈనెల తొమ్మిదో తేదీన తొలివిడత పోలింగ్ ఉంటుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు ఉంటుంది. నాలుగు విడతల ఎన్నికలు ముగిసిన వెంటనే స్థానిక పాలన అధికారికంగా ప్రారంభం అవుతుంది.
కాగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎస్ఈసీ 25 గుర్తులను ఆమోదించింది. రెండో విడతకు సబంధించి 4వ తేదీన ఉపసంహరణ ఉంటుంది. తరువాత సర్పంచ్, వార్డు సభ్యులకు గుర్తులు కేటాయిస్తారు. ఈ ఎన్నికలు పూర్తిగా రాజకీయాలకు అతీతమనే సంగతి తెలిసిందే. అయితే అభ్యర్థులకు రకరకాల గుర్తులు కేటాయించారు. దాదాపు 25 గుర్తులకు ఎస్ఈసీ ఆమోదం తెలిపింది. వారికి ప్రకటించడమే మిగిలి ఉంది.
అభ్యర్థులకు సంబంధించి.. ఎన్నికల సంఘం ఆమోదించిన గుర్తులు ఇలా ఉన్నాయి.. మంచం, కత్తెర, ఉంగరం, బుట్ట, వంకాయ, కప్పు సాసర, తేనీరు, క్యారెట్, తాళంచెవి, గొలుసు, కుర్చి, బ్యాట్, టెలిఫోన్, బల్ల, మొక్కజొన్న, పలక, ద్రాక్ష, కుండ, తిరగలి, అరటిపండు, కొవ్వొత్తులు, బ్లాక్ బోర్డు, అనాసపండు, షటిల్, చెతికర్ర, చెంచా గుర్తులు ఉన్నాయి. గుర్తులకు కాదేది అనర్హం అన్నస్థాయిలో పంచాయతీ పోరులో నిలిచే అభ్యర్థులకు రాష్ట్ర ఎన్నికల సంఘం కేటాయించింది.
ఎస్ఈసీ ఆమోదం తెలిపిన గుర్తులకు అనుగుణంగా సామాగ్రిని రూపొందించే పనిలో వ్యాపారులు సిద్ధమయ్యారు. వారి అవసరాన్ని క్యాష్ చేసుకునేందుకు రెడీగా ఉన్నారు. ఇదేమని అడిగితే తమకు ఇదే సమయం అని చెబుతున్నారు. మరోవైపు ఎస్ఈసీ వరుస పర్యటనలు చేస్తున్నారు. మొన్న రాయల సీమలో పర్యటించగా.. మంగళవారం విశాఖ, ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్నారు.