ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ జగన్ సర్కార్ ను వదిలేలా కనిపించడం లేదు. ఏపీ ఎన్నికలను నిమ్మగడ్డ తన చెప్పు చేతుల్లోకి తీసుకోవడంతో అలెర్ట్ అయిన జగన్ సర్కార్ గ్రామ పంచాయితీ ఏకగ్రీవాల అస్త్రం ప్రయోగించింది. భారీగా నజరానాలు ఇచ్చింది. దీంతో ఎన్నికలకు అవకాశం లేకుండా చాలా పంచాయితీలను ఏకగ్రీవం చేయాలని యోచించింది.
దీంతో వెంటనే ఎస్ఈసీ నిమ్మగడ్డ అలెర్ట్ అయ్యారు. ఏకగ్రీవ పంచాయితీలపై స్టిక్ట్ గా ఉండాలని కలెక్టర్లు, అధికారులను ఆదేశించారు. గ్రామాల వారీగా కన్నేయాలని.. బలవంతపు ఏకగ్రీవాలను ప్రోత్సహించవద్దని ఆదేశించారు.
అంతేకాదు.. ఎన్నికలను ప్రభావితం చేసేలా.. తన అనుమతి లేకుండా ప్రభుత్వం ‘ఏకగ్రీవాల’ ప్రకటన ఇచ్చిందని.. వెంటనే దీనిపై వివరణ ఇవ్వాలని ఏపీ సమాచార శాఖను నిమ్మగడ్డ ఆదేశించారు. కోడ్ అమల్లో ఉండగా.. ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి ప్రకటన చేయడానికి వీల్లేదని అల్టీమేటం జారీ చేశారు.
ఏకగ్రీవ పంచాయితీలపై ప్రభుత్వం తీరును తప్పుపట్టిన నిమ్మగడ్డ రమేశ్ ఈ విషయంలో ఎస్ఈసీ విధులకు భంగం కలిగితే మాత్రం మరోసారి కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమని జగన్ సర్కార్ కు షాకిచ్చారు.
ఇక అధికారులతో గొడవలేదన్న నిమ్మగడ్డ పంచాయితీ రాజ్ అధికారుల అభిశంసనను సమర్థించుకున్నారు. వారు సరిగా చేయలేకపోవడం వల్లే అలా చేశానని అన్నారు.