అధికారంలోకి రావడమే లక్ష్యంగా జగన్ తన తండ్రి బాటను అనుసరిస్తూ పాదయాత్ర చేపట్టారు. ప్రజలకు మరింత దగ్గరయ్యారు. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో అన్నీ వివరించారు. అప్పుడు ఆ పాదయాత్రలో చాలా మంది లీడర్లు ఆయన వెంట నడిచారు కూడా. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది.. జగన్ మెప్పు పొందిన పృథ్వీ గురించి. అయితే.. ఆయన ఎంత అనూహ్యంగా లైమ్‌లైట్లోకి వచ్చారో.. అంత స్పీడ్‌గా చీకట్లోకి వెళ్లిపోయారు. వివాదాల్లో చిక్కుకొని ఎస్వీబీసీ చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే.. ఇప్పుడు ఆ చైర్మన్ పదవి ఎవరికి ఇస్తారా అనేది చర్చ నడుస్తోంది.
Also Read: బీజేపీ అందుకే పోలవరాన్ని పక్కనపెట్టిందా..!
ఈ పదవిని సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వారికే ఇస్తారేమోనని తెలుస్తోంది. అందులో ముఖ్యంగా దర్శకుడు శ్రీనివాసరెడ్డి, నటి, యాంకర్ స్వప్న పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వైసీపీకి సన్నిహితంగా ఉండే ఒకరిద్దరు నటులు, నిర్మాతల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. కానీ జగన్ ఈసారి శ్రీవారి వ్యవహారాలకు సినిమా ఇండస్ట్రీకి లింకు పెట్టదలుచుకోలేదట. పూర్తిగా రాజకీయ మకిలిని కూడా అంటించ దలచుకోలేదని తెలుస్తోంది. అందుకే మధ్యే మార్గంగా సంగీత, సాహిత్యంలో ప్రవేశం ఉన్న వెంకటగిరి సంస్థానం వారసుడు.. సాయికృష్ణ యాచేంద్రను చైర్మన్ గా నియమించారు.
వెంకటగిరి రాజాలు ఆది నుంచీ టీడీపీతోనే ఉన్నారు. అప్పటి ఎన్టీఆర్ నుంచి, చంద్రబాబు వరకు రాజాలు పార్టీ కోసం పనిచేశారు. ఏనాడూ స్వప్రయోజనాలను ఆయన చూసుకోలేదు. ఇంకా చెప్పాలంటే ఆయన ఇమేజీనే టీడీపీ వాడుకొని లబ్ధిపొందింది. అలా ఉన్న ఆ నాయకుడికి చివరకు టీడీపీలో టికెట్ దొరకలేదు. రెండు సార్లు టికెట్ ఆశించినా చంద్రబాబు నిరాకరించారు.
Also Read: ఎంసెట్ రాసిన విద్యార్థులకు జగన్ సర్కార్ శుభవార్త..!
దీంతో అప్పటి నుంచి పార్టీకి దూరంగానే ఉంటున్నారు. అంతేకాదు.. 2019 ఎన్నికల్లో రాజాలు వెంకటగిరిలో వైసీపీకి మద్దతు తెలిపారు. రామనారాయణ రెడ్డి గెలుపు కోసం కృషిచేశారు. రాజకీయాల్లో ఉన్నా వివాదాలకు దూరంగా ఉండే సాయికృష్ణ యాచేంద్రకు ఎస్వీబీసీ చైర్మన్ పదవి ఇచ్చి జగన్ మరింత గౌరవాన్నిచ్చారు. గేయధార సృష్టికర్తగా, అన్నమయ్య రచనలను వెలుగులోకి తెస్తున్న సాహిత్య ప్రియుడిగా సాయికృష్ణకు పేరుంది. ఓ దఫా ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. అయితే రాష్ట్రంలో మిగతా రాజవంశీకుల్లాగా ఎప్పుడూ వెంకటగిరి రాజాలు ప్రచారం, పేరు కోరుకోలేదు. ఒకవిధంగా చెప్పాలంటే.. మొదటి నుంచి నమ్ముకున్న పార్టీలో అవమానిస్తే.. జగన్ మాత్రం ఆయనను అందలమెక్కించారు.