
ఏపీ రాజకీయాలను షేక్ చేసే నిర్ణయం తీసుకున్నారు మల్కాజిగిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. రైతు ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లాలని ఆయన డిసైడ్ అయ్యారు. ఢిల్లీలో ఓ వైపు రైతు ఉద్యమం సాగుతున్న వేళ ఆయన నాగర్ కర్నూలు జిల్లాలో ఈ ఉద్యమాన్ని రగిలించారు.
తాజాగా రేవంత్ రెడ్డి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నుంచి హైదరాబాద్ కు ఆయన పాదయాత్ర చేయడం సంచలనమైంది. అచ్చంపేటలో తొలుత రేవంత్.. రాజీవ్ రైతు భరోసా దీక్షను సందర్శించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లు రవి, సీతక్కలు పాదయాత్ర చేయాలని రేవంత్ ను కోరారు. దీంతో అప్పటికప్పుడు రాజీవ్ రైతు భరోసా దీక్షను పాదయాత్రగా మారుస్తూ ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు.
అంతకుముందు నిర్వహించిన రైతు భరోసా దీక్ష సభలో రేవంత్ మాట్లాడారు. కేంద్రప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీ ఇప్పటికే 15 లక్షల కోట్లను కార్పొరేట్లకి రుణమాఫీ చేశారని.. రైతులకు మాత్రం సాగు చట్టాలు చేసి కొనుగోలు కేంద్రాలను ఎత్తేసి ముంచేశాడని ఆరోపించారు.
రైతులను మోసం చేసే చట్టాలు తీసుకొచ్చిన మోడీకి, సపోర్టు చేసిన కేసీఆర్ కు ప్రజలు గుణపాఠం చెప్పాలని రేవంత్ కోరారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని రేవంత్ పిలుపునిచ్చారు.