కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కాంగ్రెస్ వరుసగా రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా.. నేతల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఇప్పటికే గల్లీ స్థాయికి పడిపోయిన కాంగ్రెస్ పార్టీకి కొత్త టీపీసీసీ ఎంపిక కొత్త తలనొప్పి తెచ్చిపెడుతోంది. సీనియర్ నేతలకే తమకే టీపీసీసీ పదవీ కావాలని పట్టుబడుతుండటంతో అధిష్టానం పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్న చందంగా మారింది.
Also Read: రాములమ్మ బీజేపీ నుంచి వెళ్లిపోవడానికి చంద్రబాబే కారణమట..!
టీపీసీసీ పదవీ ఒక్కరికే దక్కనుంది. అయితే దీనికోసం నేతలంతా ఎవరికీ వారు పెద్దఎత్తున లాబీయింగ్ చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి తొలి నుంచి కలిసి వస్తున్న రెడ్డి సామాజిక వర్గానికే టీపీసీసీ కట్టబెట్టాలని అధిష్టానం భావిస్తోంది. అయితే కొందరు నేతలు బీసీ కార్డును తెరపైకి తీసుకురావడంతో టీపీసీసీ పదవీ ఎవరికీ దక్కుతుందా? అనే ఆసక్తి నెలకొంది.
బీసీ నేతలను కూడా ఈసారి అధిష్టానం పరిగణలోకి తీసుకోవాల్సి వస్తోంది. కాంగ్రెస్ లో మొదటి నుంచి ముఖ్యమైన పదవులు అనుభవిస్తున్న రెడ్డి వర్గానికి చెక్ పెట్టేలా బీసీ నేతలు పావులు కదుపుతున్నారు. దీంతో బీసీ నేతలంతా ఓవైపు.. రెడ్డి నేతలంతా ఓ మరోవైపు చేరుతున్నారు. అయితే వీరిలోనూ సపరేట్ గ్రూపులు కడుతూ ఎవరికీ వారు టీపీసీసీ కోసం ప్రయత్నం చేస్తుండటం గమనార్హం.
రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎంపీలు రేవంత్‌రెడ్డి.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు.. జగ్గారెడ్డి.. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిలు ముందున్నారు. బీసీ వర్గం నుంచి వి.హన్మంతరావు.. పొన్నాల లక్ష్మయ్య.. పొన్నం ప్రభాకర్.. మధుయాష్కీగౌడ్.. అంజన్ కుమార్ యాదవ్ పేర్లు ప్రధానంగా విన్పిస్తున్నాయి.
Also Read: పరుష ప్రసంగానికి కేసీఆర్ పుల్ స్టాఫ్..!! ఆ రెండు ఎన్నికల తరువాత మారిపోయాడా..?
కాంగ్రెస్ లోని గ్రూపు రాజకీయాల వల్ల టీపీసీసీని ఆశిస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగినట్లు కన్పిస్తోంది. పదవులు ఆశిస్తున్న నేతలు ఎక్కువగా ఉండటంతో వీరందరినీ ఎలా బుజ్జగించాలో తెలియక అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది.
పదవులు దక్కని నేతలంతా బీజేపీ వైపు వెళ్లే అవకాశం ఉండటంతో కాంగ్రెస్ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. రెడ్డి వర్గానికి ధీటుగా బీసీ నేతలు పావులు కదుపుతుండటంతో ఎవరికీ టీపీసీసీ దక్కుతుందోననే ఆసక్తి కాంగ్రెస్ వర్గాల్లో నెలకొంది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్