Raghu Rama Krishnam Raju: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సర్వేల సందడి మొదలైంది. వివిధ పార్టీల భవితవ్యాలు తేల్చే సర్వేలను పార్టీలు నిర్వహిస్తున్నాయి. తమ బలాలు, బలహీనతల గురించి తెలుసుకునేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో సైతం సర్వేలు వైరల్ అవుతున్నాయి. తాజాగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghu Rama Krishnam Raju) ఓ సర్వే వివరాలు ప్రకటించారు. రాష్ర్టంలో టెలిఫోన్ సర్వే చేయించారు. వైసీపీకి ప్రస్తుత పరిస్థితుల్లో యాభై సీట్లు కూడా రావని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు, చిత్తూరు జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేల పరిస్థితి మాత్రమే బాగుందని పేర్కొన్నారు. మిగతా వారు గెలవడం కష్టమే అని చెప్పారు. నర్సాపురంలో జగన్ కంటే తనకే తొంభై శాతం ఎక్కువ ఆదరణ ఉందన్నారు.
వాస్తవానికి సర్వేను బయట పట్టదల్చుకోకున్నా కొన్ని కారణాల వల్ల బహిర్గతం చేయాల్సి వచ్చిందని ఎంపీ రఘురామ పేర్కొన్నారు. కొద్ది రోజులుగా తనపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో తాను కూడా సర్వే చేయించానని గుర్తు చేశారు. తనపై చేస్తున్న సర్వేపై రఘురామ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. తనపై కావాలనే తప్పుడు సర్వేలు పెడుతూ అనవసర పోస్టులు పెడుతున్నారని విమర్శలు చేశారు.
ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ పరిస్థితి బాగాలేదని చెప్పారు. సీట్ల విషయంలో ప్రస్తుత పరిస్థితుల్లో అయితే యాభై సీట్లు కూడా దాటవని, తరువాత పరిస్థితి తాను చెప్పలేనని అన్నారు. ఇటీవల ఇండియా టుడే మూడ్ ఆప్ ది నేషన్ పోల్స్ ప్రకటించిన తరువాత సోషల్ మీడియాలో సర్వేల హడావిడి పెరిగిందన్నారు. ఏపీలో సర్వేల పరిస్థితి ఎక్కువగా ఉంది. అయితే తనపై కావాలనే దురుద్దేశంతోనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని వివరించారు. తన సర్వే బూటకమని చెప్పడం నాయకుల తెలివితక్కువ తనానికి నిదర్శనమని వివరించారు.
ఈ నేపథ్యంలో వైసీపీ పరిస్థితిపై రఘురామ వెల్లడించడంతో నాయకులు హైరానా పడుతున్నారని చెబుతున్నారు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ విజయం ఖాయమని చెబుతున్నా వారిలో కూడా ఏదో ఒక చోట భయం పట్టుకుంది. దీంతో రఘురామ వర్సెస్ వైసీపీ గా రాజకీయం సాగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. సర్వే వివరాలతో నాయకుల్లో భయం పట్టుకుందని రఘురామ పేర్కొన్నారు. భవిష్యత్ లో పార్టీల భవితవ్యంపై అందరు సర్వేల బాట పడుతున్నారని చెప్పారు.