
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. చాలామంది జనాలు ఆ ఫేక్ వార్తలను అసలైన వార్తలని నమ్మి తెగ ప్రచారం చేసున్నారు. తాజాగా భాగ్యనగరంలో అలాంటి ఫేక్ వార్త ఒకటి హల్చల్ చేస్తోంది. జీరో అకౌంట్లు ఓపెన్ చేస్తే కేంద్ర ప్రభుత్వం డబ్బులు జమ చేస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో జీరో అకౌంట్ల కోసం జనాలు పోస్టాఫీసుల ముందు క్యూ కడుతున్నారు.
వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం జీరో అకౌంట్లు ఉన్నవాళ్లకు నగదు జమ చేస్తామని ఎక్కడా చెప్పలేదు. అయితే జనం మాత్రం కేంద్రం నిజంగా నగదు జమ చేస్తే తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని భావిస్తున్నారు. భాగ్యనగరంలోని చాలా పోస్టాఫీసుల ముందు ఇదే పరిస్థితి నెలకొంది. కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్నా, ముఖ్యమైన పనులు ఉన్నా ప్రజలు మాత్రం పనులు మానేసుకుని పోస్టాఫీసుల ముందు క్యూ కడుతుండటం గమనార్హం.
గడిచిన వారం రోజులుగా నగరంలో ఈ తరహా ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ వార్తలను ఎవరు ప్రచారం చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో అనే వివరాలు మాత్రం తెలియడం లేదు. ఇలాంటి వార్తలు వైరల్ కావడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా అనేక సందర్భాల్లో ఈ తరహా ప్రచారం జరగగా అధికారులు స్పందించి స్పష్టతనిచ్చారు. మరోవైపు భారీ క్యూ లైన్లు పోస్టాఫీస్ వర్గాలను తెగ టెన్షన్ పెడుతున్నాయి.
జీరో బ్యాలన్స్ అకౌంట్ ఓపెన్ చేయడానికి వచ్చిన వాళ్లలో చాలామంది మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం లాంటి కనీస జాగ్రత్తలను తీసుకోవడం లేదు. మరోవైపు కరోనా వల్ల పోస్టాఫీసులకు పూర్తిస్థాయిలో ఉద్యోగులు విధులకు హాజరు కావడం లేదు. దీంతో పరిమిత సంఖ్యలో ఉన్న ఉద్యోగులపైనే అదనపు భారం పడటం గమనార్హం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైరల్ అవుతున్న ఫేక్ వార్తలపై ప్రజలకు స్పష్టతనివ్వాలని పలువురు సోషల్ మీడియా వేదికగా సూచిస్తున్నారు.