https://oktelugu.com/

సోనియా గాంధీని నమ్ముకుంటే నిండా మునిగినట్లే

మొదట్నుంచీ కుటిలనీతినే పాటించిన సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ గత చరిత్ర ఘనమైనా ఇటీవలికాలంలో పూర్తిగా మసకబారింది. సోనియా గాంధీ 1998లో అధ్యక్షపదవి చేపట్టిన తర్వాత అది పూర్తిగా దాని పూర్వ ప్రభ కోల్పోయింది. అయినా 2004 లో అధికారంలోకి వచ్చింది. అంతకుముందు అయిదు సంవత్సరాలు వాజపాయి ప్రధానమంత్రిగా అధికారంలో వున్నా, పరిపాలనలో మార్కులు సంపాదించినా ప్రజలు మాత్రం తిరస్కరించారు. అదొక్కటే ఆవిడ అధ్యక్షురాలిగా సాధించిన ఘనకార్యం. దానికి అనేక కారణాలున్నాయి. అప్పట్నుంచే ఆవిడ కుటిలనీతి రాజకీయాలు […]

Written By:
  • Ram
  • , Updated On : July 15, 2020 / 07:07 AM IST
    Follow us on

    మొదట్నుంచీ కుటిలనీతినే పాటించిన సోనియా గాంధీ

    కాంగ్రెస్ పార్టీ గత చరిత్ర ఘనమైనా ఇటీవలికాలంలో పూర్తిగా మసకబారింది. సోనియా గాంధీ 1998లో అధ్యక్షపదవి చేపట్టిన తర్వాత అది పూర్తిగా దాని పూర్వ ప్రభ కోల్పోయింది. అయినా 2004 లో అధికారంలోకి వచ్చింది. అంతకుముందు అయిదు సంవత్సరాలు వాజపాయి ప్రధానమంత్రిగా అధికారంలో వున్నా, పరిపాలనలో మార్కులు సంపాదించినా ప్రజలు మాత్రం తిరస్కరించారు. అదొక్కటే ఆవిడ అధ్యక్షురాలిగా సాధించిన ఘనకార్యం. దానికి అనేక కారణాలున్నాయి. అప్పట్నుంచే ఆవిడ కుటిలనీతి రాజకీయాలు ప్రారంభమయ్యాయి. ఆవిడ ప్రధాన మంత్రి పదవి చేపట్టటం పై చెలరేగిన వివాదం తో ఎవరిని ప్రధానమంత్రి ని చేయాలనే దగ్గరే ఆవిడ ఆలోచనలు పక్కదారి పట్టాయి. అందరూ అనుకుంటున్నట్లు మన్మోహన్ సింగ్ మంచి ఆర్దికమంత్రిగా పనిచేసిన రికార్డు చూసి ఆయనను ఎంచుకోలేదు. వాస్తవానికి ఆరోజుకి పార్టీలో సోనియా గాంధీ తర్వాత పాపులర్ నాయకుడుగా ప్రణాబ్ ముఖర్జి వున్నాడు. అందరినీ కలుపుకొని పోగలిగిన సమర్ధత వున్నవాడు. అయినా మన్మోహన్ సింగ్ ని ఎంపికచేసింది . దానికి వున్న ఒకే ఒక కారణం విధేయత. ప్రణాబ్ ముఖర్జీ సమర్దుడైనా ముందు ముందు ఏకు మేకవుతాడేమోనని అభద్రతా బావంతో తనన్ని పక్కనపెట్టింది. మన్మోహన్ సింగ్ ఆర్దికమంత్రిగా పేరు తెచ్చుకున్నా ప్రధానమంత్రి కి కావాల్సిన నాయకత్వ లక్షణాలు లేవు. అదే ఆయనకు వరమయ్యింది. వాస్తవానికి ప్రణాబ్ ని ప్రధానమంత్రిని చేసి ఆయన కింద మన్మోహన్ సింగ్ ని ఆర్ధికమంత్రిని చేసుంటే బాగుండేది. సోనియా గాంధీ ప్రణాబ్ ని మన్మోహన్ కింద పనిచేయించటం సీనియర్ నాయకుడ్ని అవమానించటమే. కాకపోతే ప్రణాబ్ అయితే ఫైళ్ళు అనధికారికంగా 10 జన్ పద్ కి పంపించి ఉండేవాడు కాదుకదా. ఎటువంటి జవాబుదారీతనం లేకుండా రిమోట్ కంట్రోల్ పరిపాలన చేయాలంటే మన్మోహన్ సింగ్ అయితేనే సాధ్యమవుతుంది. కాబట్టి సోనియా గాంధీ కుటిలనీతి 2004 లోనే మొదలయ్యింది. రాజకీయ నాయకుడే ప్రధానమంత్రి అయితే సమాజాన్ని గురించి పూర్తి అవగాహనతో నిర్ణయాలు తీసుకుంటారు. అయినా పది సంవత్సరాలు అధికారం లో ఉండటంతో ఆవిడలోని లోపాలు పెద్దగా బయటపడలేదు. కాకపోతే ఆవిడ చెప్పింది వినకపోతే పరిణామాలు ఎలావుంటాయో పివి నరసింహారావు మరణం అప్పుడు అందరికీ బహిరంగంగా తెలిసింది. అయిదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానమంత్రిగా వున్న వ్యక్తి ని అంత్యక్రియలకు కూడా డిల్లీ లో అనుమతి ఇవ్వకుండా, చివరకు ఆయన పార్ధీవ దేహాన్ని కడసారి చూపులకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లోకి కూడా రానివ్వకపోవటం చూసిన తర్వాత నైనా నిజమైన కాంగ్రెస్ వాదులు అప్పుడే ప్రతిస్పందించక పోవటం వాళ్ళు గాంధీ కుటుంబానికి ఎంతగా విధేయులుగా మారారో అర్ధమవుతుంది. గాంధీ కుటుంబం లేకపోతే కాంగ్రెస్ లేదు అనేదాకా వాళ్ళు మానసికంగా సిద్ధమయిపోయారు. అవునుమరి ఇండియా ఇందిరా , ఇందిరా ఇండియా అన్న సంస్కృతికి అలవాటుపడ్డారు కదా.

    అసమర్ధ నాయకురాలు సోనియా గాంధీ 

    సోనియా గాంధీ కి సమర్ధత లేదనేదానికి మన తెలుగు రాష్ట్రాలే ఉదాహరణ. వై ఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం కాంగ్రెస్ రాజకాయాల్ని నిర్వహించటం చేతకాక రెండు రాష్ట్రాలని కాంగ్రెస్ రహిత రాష్ట్రాలుగా చేసుకుంది. ముందుగా రాజశేఖర రెడ్డి కుమారుడిని దూరంచేసుకుంది. తర్వాత వచ్చిన ప్రత్యేక తెలంగాణా, సమైక్య ఆంద్ర ఉద్యమాల్ని పరిష్కరించటం లో వేసిన తప్పటడుగులు అటు తెలంగాణాలో, ఇటు ఆంధ్రలో పార్టీని నామరూపాల్లేకుండా చేసింది. అయినా తెలంగాణాలో ఎక్కడో ఆశ కొట్టుమిట్టాడుతుంది. కానీ రాను రాను ఇక్కడకూడా బలహీన పడుతుంది. ఇప్పుడు దేశంలో జరిగే పరిణామాలు భవిష్యత్తు లో తెలంగాణాలోనూ ప్రతిబింబిస్తాయి. ఒకనాడు వుమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కి పెట్టనికోట. మరి ఈరోజు?

    వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకున్న రాహుల్ గాంధీ 

    ఇదే మిగతా చోట్లకూడా జరుగుతుంది. అస్సాం లో హిమంత బిస్వా శర్మ ని దూరం చేసుకొని పూర్తిగా ఈశాన్య భారతాన్ని పోగొట్టుకుంది. హర్యానాలో భూపేంద్ర హుడా కోసం దళిత నాయకుడ్ని వదిలేసుకుంది. అయినా ప్రజలు కాంగ్రెస్ ని పూర్తిగా విస్మరించ లేదు. మధ్య ప్రదేశ్,  రాజస్తాన్, చత్తీస్ గడ్ లలో పట్టం కట్టారు. గుజరాత్ లో గట్టి పోటీ ఇచ్చారు. అధ్యక్షపదవి వదిలిన తర్వాత రాహుల్ గాంధీ కి పూర్తి స్వేచ్చనివ్వాలి. అంతేగానీ మన్మోహన్ సింగ్ ని కట్టడి చేసినట్లు రాహుల్ గాంధీ ని కూడా తను చెప్పినట్లే వినాలని కంట్రోల్ చేయటమే ఈ పరిస్థితి కి కారణమని అనుకుంటున్నారు. ఒక టైములో పార్టీ నిర్మాణాన్ని సమూలంగా మార్చి కొత్త నాయకత్వం తో నింపాలని తను భావించినట్లు తెలుస్తుంది. అదే జరిగివుంటే కాంగ్రెస్ కి ఈ గతి పట్టేది కాదు. కురువృద్ధులందరూ సోనియా గాంధీని ఆశ్రయించి ఆ సంస్కరణలు జరగకుండా ఆపినట్లు తెలుస్తుంది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ లోనూ యువ రక్తాన్ని నింపుతారనే ప్రచారం జోరుగా సాగింది. అది జరక్కుండా చేసింది సోనియా గాంధీ అని చెప్తున్నారు. చివరకు రాహుల్ గాంధీ రాజీనామా చేసి కొత్త నాయకుడ్ని ఎన్నుకోవాలని పిలుపునిచ్చినా అది జరక్కుండా తిరిగి ఆపధర్మ అధ్యక్షురాలిగా తనే రావటం తో పార్టీ యువ నాయకత్వానికి కష్టాలు మొదలయ్యాయి.

    కొత్త నాయకత్వాన్ని బలిపశువుల్ని చేసిన సోనియా గాంధీ 

    మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాలనే తీసుకుందాం. కమల్ నాథ్ మధ్యప్రదేశ్ లో సోనియా గాంధీ దగ్గర చక్రం తిప్పి తనే నాయకుడు అయ్యాడు. కనీసం ఆ తర్వాతనైనా జ్యోతిరాదిత్య సిందియా కి  సరైన గౌరవమిచ్చి అసంతృప్తిని పారద్రోలే పనిచేయలేదు. ఎప్పటికైనా తనకు పోటీ అవుతాడని దిగ్విజయ్ సింగ్ తో కలిసి తనని ఒంటరి చేయాలని ప్రయత్నం చేసాడు. ఇంతజరుగుతున్నా కమలనాథ్ ని వారించే ప్రయత్నం సోనియా గాంధీ చేయలేదు. దానితో తనదారి తాను చూసుకున్నాడు. అలాగే రాజస్తాన్ లో సచిన్ పైలట్ అందరిలాగా కాకుండా 2014 లో అధ్యక్షుడైన దగ్గర్నుంచి నివాసం కూడా మార్చుకొని అక్కడే వుండి పార్టీని కిందస్థాయి నుంచి తిరిగి నిర్మించాడు. అయినా ఎన్నికలోచ్చేటప్పటికి అశోక్ గెహ్లాట్ సోనియా గాంధీ దగ్గర చక్రం తిప్పి ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ సారి ప్రియాంక గాంధీ కూడా తన తల్లితో పాటు రాహుల్ గాంధీ పై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తుంది. అందరూ అనుకోవటం హర్యానాలో భూపేంద్ర హుడా లాగా రాజస్తాన్ లో అశోక్ గెహ్లాట్ కూడా రాబర్ట్ వాద్రా భూ కొనుగోళ్లలో సహాయం చేసాడు కాబట్టి అశోక్ గెహ్లాట్ నే ముఖ్యమంత్రి చేసారనేది. అదే నిజమయితే స్వంత ప్రయోజనాల కోసం పార్టీ ప్రయోజనాల్ని తాకట్టు పెట్టినట్లు అనుకోవాలి. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితంగా వున్న ఇద్దరూ ఇలా దూరం కావటం రాహుల్ గాంధీ వ్యక్తిత్వానికి దెబ్బనే. ఎందుకంటే అప్పటికి తనే అధ్యక్షుడిగా వుండి మిత్రుల ప్రయోజనాల్ని కాపాడకుండా తల్లిమాట కే విలువిచ్చాడు. అందుకే వాళ్లకు తన మీద గురి పోయింది. అలాకాని పక్షంలో వీళ్ళిద్దరూ ఎప్పటికైనా పార్టీలో తనకు పోటీ అవుతారని అభద్రతాభావం తో ఇలా చేసివుండొచ్చు. ఎందుకంటే 2019 లో రాహుల్ గాంధీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నప్పుడు  సచిన్ పైలట్ కానీ, జ్యోతిరాదిత్య సిందియా కానీ ఆ పదవిని చేపడతారని వూహించారు. ఇక్కడే కాంగ్రెస్ శ్రేణులు అమాయకంగా సోనియా గాంధీ ని, రాహుల్ గాంధీ ని నమ్మారు. 2004 లోనే ప్రణాబ్ ముఖర్జీ ని కాకుండా చేసినప్పుడు ఇప్పుడు పాపులర్ నాయకుల్ని చేస్తారని ఊహించటం గొర్రె కసాయివాడిని నమ్మినట్లే వుంది. సోనియా గాంధీ తన కొడుక్కి ఇంకొకరు పోటీగా తయారవ్వటం సహించలేదు కదా. ఈ విషయం తెలియక పాపం కాంగ్రెస్ శ్రేణులు సోనియా గాంధీ ని అమాయకంగా నమ్మారు.

    సోనియా గాంధీ ని నమ్ముకుంటే కుక్క తోక పట్టుకొని గోదారి ఈదినట్లే 

    ఇంతవరకు ఎప్పటికైనా కాంగ్రెస్ లో అంతరంగిక ప్రజాస్వామ్యాన్ని పాటిస్తారని యువకులను నాయకత్వ స్థానానికి ప్రోత్సహిస్తారని ఎక్కడో కొంత ఆశ వుండేది. ఈ ఇద్దరు నాయకుల్ని ముఖ్యంగా సచిన్ పైలట్ బయటకు పోయే పరిస్థితులు సృష్టించటం చూసిన తర్వాత కాంగ్రెస్ తిరిగి పునరుజ్జీవం పొందుతుందనే ఆశలు అడుగంటాయి. సోనియా గాంధీ చివరకు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయటానికే పూనుకున్నట్లు తెలుస్తుంది. వుంటే తన కుటుంబం వుండాలి లేకపోతే కాంగ్రెస్ నాశనమైనా పర్వాలేదనే తరహాలోనే పావులు కదపటం చూస్తున్నాం. ఇంకా ఎవరికైనా సోనియా గాంధీ ని నమ్ముకొని కాంగ్రెస్ ని తిరిగి అధికారం లోకి తీసుకురాగలమని అనుకుంటే కుక్కతోక పోక పట్టుకొని గోదావరి ఈదినట్లే నని గ్రహించాలి.