ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్ భవనాన్ని ఆంగ్లేయుల కాలంలో నిర్మించారు. ఢిల్లీ నగరాన్ని నిర్మించిన ఎడ్విన్ లుటియన్స్.. హెర్బర్ట్ బేకర్స్ ప్రస్తుత పార్లమెంట్ భవనానికి రూపకర్తలు. ఈ పార్లమెంట్ భవనానికి 1921 ఫిబ్రవరి 21న శంకుస్థాపన జరుగగా.. దీని నిర్మాణానికి ఆరేళ్ల సమయం పట్టింది. ఈ భవనాన్ని 1927 జనవరి 18న నాటి భారత గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్ ప్రారంభించారు. ఈ పార్లమెంట్ భవనానికి అప్పట్లోనే రూ.83లక్షలు ఖర్చయ్యింది.
Also Read: కొత్త పార్లమెంట్ భవనం భారతీయుల ఆకాంక్షకు ప్రతీక: ప్రధాని
ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ భవనం శిథిలావస్థకు చేరడంతో కేంద్ర ప్రభుత్వం కొత్త భవన నిర్మాణానికి ప్రతిపాదించింది. దీనికి బీజం ఏడేళ్ల కిందటే పడింది. నాటి లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కొత్త పార్లమెంట్ భవన అవశ్యకతను ప్రభుత్వానికి వివరించారు. కొత్త పార్లమెంట్ భవనంలో కాగితం వినియోగం లేకుండా ఆధునిక హంగులతో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఆమె సూచించారు.
యూపీఏ హయాంలో కాగితాలకే పరిమితమైన కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం మోదీ హయాంలో కార్యరూపం దాల్చబోతుంది. ఈమేరకు పార్లమెంట్ భవనానికి సమీపంలో సెంట్రల్ విస్టాలో భాగంగా కొత్త ప్రాజెక్టును మోదీ ప్రభుత్వం చేపట్టబోతుంది. కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం కోసం టెండర్లు పిలువగా కాంట్రాక్టును టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ గత సెప్టెంబర్లో సొంతం చేసుకుంది.
కొత్త పార్లమెంట్ భవనానికి ప్రధాని మోదీ నేడు(డిసెంబర్ 10న) శంకుస్థాపన చేశారు. భారతీయుల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం ఉంటుందని.. వందేళ్లకు సరిపడేలా ‘సెంట్రల్ విస్టా’ను నిర్మిస్తున్నట్లు స్పష్టం చేశారు. కొత్త పార్లమెంట్ భవనంలో పార్లమెంటరీ మంత్రిత్వశాఖ కార్యాలయం.. లోక్‌సభ, రాజ్యసభ సెక్రటేరియట్లు.. ప్రధాన మంత్రి కార్యాలయం.. ఎంపీల కోసం కొన్ని కార్యాలయాలతో సహా 120 కార్యాలయాలు అందుబాటులో ఉండనున్నాయి.
కొత్త పార్లమెంట్ భవనం మొత్తం 64,500 చదరపు మీటర్ల వైశాల్యంలో ఉండనుంది. నాలుగు అంతస్థులు భవనం ఉండనుంది. పాత లోక్ సభలో 543మంది సభ్యులకు సరిపడా సిట్టింగ్ ఉంది. అయితే కొత్త పార్లమెంట్ భవనంలోని లోక్ సభలో ప్రస్తుతం 888మంది సభ్యులు కూర్చునేలా నిర్మిస్తుండగా.. భవిష్యత్ అవసరాల దృష్ట్యా మొత్తం 1,224 సభ్యులు కూర్చునేలా నిర్మాణం జరుగనుంది.
Also Read: బీజేపీ వైపు తెలంగాణ ఉద్యోగ సంఘాల చూపు..!?
ఇక పాత రాజ్యసభలో 245మంది సభ్యులకు సిట్టింగ్ సౌకర్యం ఉండగా కొత్త దాంట్లో 384మంది సభ్యులు కూర్చునేలా నిర్మిస్తున్నారు. భవిష్యత్తులో ఈ సంఖ్య పెరిగినా ఇబ్బంది లేకుండా పెద్ద హాల్‌ను నిర్మించనున్నారు. అలాగే అండర్ గ్రౌండ్ ఫ్లోర్‌లో 20మంది మంత్రుల కార్యాలయాలు ఏర్పాటు చేయబోతున్నారు. ఎంపీల కోసం రీడింగ్ రూమ్ కూడా ఉంటుంది. అయితే సెంట్రల్ హాల్ మాత్రం ఉండదు.
ప్రస్తుతం ఉభయసభల సంయుక్త సమావేశం పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో నిర్వహిస్తుండగా.. కొత్త భవనంలో లోక్‌సభ చాంబర్‌లో నిర్వహించేలా సీటింగ్ సౌకర్యం పెంచుతున్నారు. ఒక్కో సీటులో ఇద్దరు కూర్చునే సౌకర్యం ఉండనుంది. ఒకవేళ ఉభయసభల సంయుక్త సమావేశం నిర్వహిస్తే మూడు సీట్లకు పెంచుకోనేలా నిర్మాణం చేయనున్నారు.
కొత్త పార్లమెంట్ భవనాన్ని టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ నిర్మించనుండగా.. రూపకల్పన మాత్రం హెచ్‌సీపీ డిజైన్, ప్లానింగ్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ చేసింది. పార్లమెంటులోని లోక్ సభ పైకప్పు పురివిప్పిన నెమలి ఆకారంలోనూ.. రాజ్యసభ పైకప్పు విరబూసిన కమలం ఆకృతిలోనూ.. పార్లమెంట్ అంతర్భాగం జాతీయ వృక్షమైన మర్రిచెట్టు ఆకృతిలో ఉండనుంది.
ఈ భవన నిర్మాణానికి సుమారు రూ.971 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. కొత్త పార్లమెంట్ భవనంలో మొత్తం ఆరు గేట్లు ఉండనుండగా.. నాలుగు అంతస్తుల్లో భవన నిర్మాణం జరుగనుంది. పార్లమెంట్ భవన నిర్మాణంపై సుప్రీం కోర్టులో కేసు ఉన్న నేపథ్యంలో దీనిని ఎప్పుడు ప్రారంభిస్తారనేది క్లారిటీ రావాల్సి ఉంది. కాగా ఈ భవనాన్ని 2022నాటికి పూర్తి చేసేలా కేంద్రం ప్రతిపాదించింది.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్