2020 సంవత్సరం కరోనా నామ సంవత్సరంగా మారిపోయింది. ఈ ఏడాదంతా కరోనాతోనే గడిచిపోతోంది. దీనికితోడు కొత్త కరోనా కొత్త ఏడాదికి ముందే కోరలు చాస్తుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.
బ్రిటన్.. దక్షిణాఫ్రికాల్లో వెలుగుచూసిన కరోనా కొత్త వైరస్ ఇప్పుడు మిగతా దేశాల్లోనూ నమోదవుతున్నాయి. దీంతో యూరప్ దేశాలు లాక్డౌన్ అమలు చేస్తుండగా మరికొన్ని దేశాలు అదే బాటలో నడుస్తున్నాయి.
భారత్ లోనూ కొత్త కరోనా కేసులు నమోదవుతుండటంతో కేంద్రం సైతం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తుంది. ఇప్పటికే యూకే నుంచి గత నెలరోజులుగా భారత్ వచ్చిన వారి వివరాలను సేకరించింది.
వీరిందరికీ కరోనా టెస్టులు నిర్వహించగా 114మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు పేర్కొంది. వీరిలోనూ కొత్త కరోనా స్ట్రెయిన్ కేసులు ఆరు నమోదైనట్లు నిన్న కేంద్రం ప్రకటించింది. అయితే తాజాగా ఆ కేసులు 20కి పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీ 9.. బెంగళూరులో 7.. హైదరాబాద్‌లో 2.. కోల్‌కతాలో 1.. పూణెలో 1 చొప్పున కొత్త స్ట్రెయిన్ కేసులు నమోదయ్యాయి. కరోనా సోకిన వారందరినీ ప్రత్యేకంగా ఐసోలేషన్ చేసి వైద్యులు చికిత్స చేస్తున్నారు.
కేవలం 24గంటల్లోనే ఆరు నుంచి కేసుల సంఖ్య 20కి పెరిగడంతో కేంద్రం అప్రమత్తమైంది. అలాగే కరోనా కొత్త స్ట్రెయిన్ సోకినవారు ఎవరెవరినీ కలిశారనేది దానిపై ఆయా రాష్ట్రాలు ట్రేసింగ్ చేస్తున్నారు. దీంతో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.