
ప్రధాని, బీజేపీ పెద్దాయన నరేంద్రమోడీ రంగంలోకి దిగాడు. ఎన్నికల కార్యక్షేత్రంలోకి దూకాడు. దేశంలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడంతో గెలుపు అవకాశాలున్న రెండు రాష్ట్రాలపై మోడీ ప్రధానంగా ఫోకస్ చేశాడు.
పశ్చిమ బెంగాల్ లో పాగా వేయాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ దూకుడుగా ముందుకు వెళుతోంది. ఇందులో భాగంగా ప్రధాని మోడీ ప్రచార పర్వంలోకి నేరుగా దిగుతున్నారు. ఎనిమిది విడతల్లో జరగబోయే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోడీ 20 ర్యాలీల్లో పాల్గొననున్నారు.
అలాగే అసోంలో కూడా ఆరు ర్యాలీల్లో మోడీ పాల్గొననున్నారు. ఈ మేరకు రోడ్ మ్యాప్ సిద్ధమైంది. ఈ రెండు రాష్ట్రాల్లో అత్యధిక జిల్లాలను కవర్ చేస్తూ మోడీ ప్రచారం సాగేలా బీజేపీ నేతలు ప్రణాళికలు రూపొందించారు.
ఈ ఐదు రాష్ట్రాల్లో ఒక్కటి అయినా బీజేపీ గెలవకుండా 2023 ఎన్నికలకు ముందు ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ ఖాయం. అందుకే అమిత్ షా, మోడీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకెళుతున్నారు.
గత 2019 ఎంపీ ఎన్నికల్లో బెంగాల్ లో బీజేపీ గణనీయమైన సీట్లు సాధించింది. ఆ ఉత్సాహంతోనే ఈసారి బెంగాల్ లో మమతా బెనర్జీని ఓడించాలనే పట్టుదలతో ముందుకెళుతోంది. కసితో నేతలు పనిచేస్తున్నారు.
మార్చి 7న కోల్ కతాలోని బ్రిగేడ్ మైదానంలో మోడీ తొలి ప్రచార ర్యాలీ నిర్వహిస్తున్నాడు. ఇందులో అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్ నాత్ సింగ్, యోగి ఆధిత్యనాథ్, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, స్మృతి ఇరానీ సహా దిగ్గజ నేతలంతా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే బెంగాల్ , అసోంలో రాజకీయ వేడి రాజుకుంది.