
Mirchi Bajji: అసలే వానాకాలం.. ఈ చల్లచల్లని చినుకులు పడుతుంటే.. వేడివేడిగా ఏదైనా తినాలని అనిపిస్తుంది. ముఖ్యంగా వర్షాలు కొడుతుంటే ‘మిర్చి బజ్జీ’ తింటే ఆ టేస్టే వేరప్పా అంటారు. కానీ అదే మిర్చి బజ్జీ ఇప్పుడు ఒక వ్యక్తి ప్రాణాలు తీసేసింది. మిర్చి బజ్జీ తింటుండగా మృత్యువు ఆ వ్యక్తిని కబలించింది. తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో ఓ 40 ఏళ్ల వ్యక్తిని మిర్చి బజ్జీ బలితీసుకుంది.
మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం వేముల గ్రామానికి చెందిన మల్లేశ్ కొంతకాలంగా హైదరాబాద్ లో నివాసముంటున్నాడు. సొంత పనులను నిమిత్తం వేముల గ్రామానికి వెళ్లాడు. నిన్న అర్థరాత్రి ఇంటి దాబాపై కూర్చొని హోటల్ నుంచి తెచ్చుకున్న మిర్చి తింటున్నాడు. ఈ క్రమంలోనే మిర్చి గొంతుకు అడ్డుపడడంతో అక్కడికక్కడే ఊపిరాడక మల్లేశ్ మృత్యువాత పడ్డాడు.
కుటుంబ సభ్యులు రాత్రి కావడంతో మేడపైనే మల్లేష్ నిద్రపోయాడని అనుకున్నారు. కానీ కిందకు రాకపోవడంతో వెళ్లి చూడగా మల్లేశ్ మృతిచెంది ఉన్నాడు. బజ్జీ గొంతుకు అడ్డుపడడంతోనే మల్లేశ్ మృతిచెందాడని తేల్చారు.
ఇలా వానాకాలం వేళ కక్కుర్తి పడి మీరు ఆబగా తింటే ఏం జరుగుతుందో ఒక ఉదాహరణ మాత్రమే ఇది. అందుకే ఏదైనా నెమ్మదిగా.. మెల్లిగా చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. వ్యక్తిని బలితీసుకున్న మిర్చి బజ్జీ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.