
Rajamouli, Mytri movie makers : దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా అంటే.. హిట్టే అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. ఇప్పటి వరకు ట్రాక్ రికార్డు అలా ఉంది మరి. రెండు దశాబ్దాలుగా అపజయం ఎరుగని దర్శకుడిగా కొనసాగుతున్న జక్కన్న.. తన స్థాయిని టాలీవుడ్ ను దాటి, బాలీవుడ్ ను అధిగమించి, హాలీవుడ్ స్థాయికి చేరింది. అందుకే.. రాజమౌళితో ఒక్క సినిమా చేయాలని ఇటు హీరోలు, అటు నిర్మాతలు ఆశపడుతున్నారు. లేట్ గా వచ్చినా.. లేటెస్ట్ గా జక్కన్న సినిమాలు ఉంటాయి కాబట్టి.. ఎంత టైమ్ అయినా ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో మరో భారీ ప్రాజెక్టుకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. భారీ చిత్రాల ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి ఓ బడా చిత్రానికి రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
ప్రస్తుతం రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ దసరాకు ప్రేక్షకుల ముందుకు తెస్తామని చెప్పినప్పటికీ.. కుదరలేదు. రిలీజ్ వాయిదా వేస్తున్నట్టు జక్కన్న అఫీషియల్ గా ప్రకటించారు. కరోనా నేపథ్యంలో కుదరలేదని, ఎప్పుడు విడుదల చేసేదీ త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. అయితే.. ఉత్తర భారతంలో పరిస్థితులు ఇంకా కుదట పడలేదు. థియేటర్లోకి గతంలో మాదిరిగా జనాలు రావట్లేదు. ఇటీవల రిలీజ్ అయిన అక్షయ్ కుమార్ బెల్ బాటమ్, కంగనా తలైవి చిత్రాలకు కలెక్షన్లు పెద్దగా రాలేదు. దీంతో.. కొన్ని రోజులు ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ వాయిదా వేయడమే మంచిదని రాజమౌళి భావించారని ప్రచారం సాగుతోంది.
ఈ చిత్రం తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శకధీరుడు సినిమా చేయాల్సి ఉన్న సంగతి తెలిసిందే. ‘మహేష్ బాబుతో సినిమా కోసం కథ రెడీ చేయాలని ఒకసారి రాజమౌళి నా దగ్గరకు వచ్చి కథ కావాలని అడిగాడు. ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఉండాలని చెప్పాడు’ అని విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అదింకా స్క్రిప్ట్ దగ్గరే ఉందని కూడా చెప్పారు.
తానూ, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్ స్మిత్ కు పెద్ద అభిమానులమని.. ఆయన పుస్తకాల ఆధారంగా స్క్రిప్ట్ రాయాలనుకుంటున్నా అని విజయేంద్ర ప్రసాద్ సంచలన విషయాలు వెల్లడించారు. దీంతో.. మహేష్ బాబు జంగల్ హీరోగా ఉండబోతున్నాడనే విషయం దాదాపుగా కన్ఫామ్ అయ్యినట్టేననే టాక్ ఉంది.
ఈ సినిమా పూర్తయిన తర్వాత చేయబోయే ప్రాజెక్టు కూడా ఇప్పుడు చర్చల్లోకి వచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రిమూవీ మేకర్స్ తో కలిసి రాజమౌళి భారీ చిత్రానికి ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు.. ఈ చిత్రం కోసం మైత్రి మూవీస్ నుంచి జక్కన్న అడ్వాన్స్ కూడా తీసుకున్నాడని టాక్. ఇక, ఈ సినిమాలో హీరోగా ఎవరు నటించనున్నారు అన్నది హాట్ టాపిక్ గా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో ముగ్గురు హీరోలు నటిస్తారని తెలుస్తోంది. ఇందులో ఒకరు ప్రభాస్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. త్వరలో రాబోతున్న రాజమౌళి బర్త్ డే సందర్భంగా దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.