
దేశంలో సెకండ్ వేవ్ దారుణ పరిస్థితులను సృష్టిస్తోంది. ఈ మహమ్మారి ఇప్పటికిప్పుడు అదుపులోకి వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. దీంతో.. ఇప్పటికే చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ కూడా ప్రకటించాయి. దాదాపు సగం దేశం లాక్ డౌన్లోనే ఉంది. అయినప్పటికీ.. కరోనా తీవ్రత తగ్గట్లేదు. వైరస్ దేశవ్యాప్తంగా విస్తరించడంతో.. పూర్తిస్థాయి లాక్ డౌనే శరణ్యం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే అమెరికా వైట్ హౌజ్ సలహాదారు ఫౌచీ రెండు సార్లు ఇదే సూచన చేశారు. తాజాగా.. కేంద్రం నియమించిన టాస్క్ ఫోర్స్ కూడా లాక్ డౌన్ కంపల్సరీ అని నివేదిక ఇచ్చినట్టు సమాచారం.
మార్చిలో సెకండ్ వేవ్ మొదలైంది. అయితే.. రెండో దశ తీవ్రత ఇంతగా ఉంటుందని ఊహించని ప్రభుత్వాలు, ప్రజలు లైట్ తీసుకున్నారు. ఫలితంగా నెల రోజుల్లోనే కరోనా ఉగ్రరూపం దాల్చింది. ఒకటీ.. రెండు.. మూడు.. అంటూ… నిత్యం లక్షల కేసులు పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు ఏకంగా రోజుకు 4 లక్షల కేసులు నమోదవుతుండగా.. దాదాపు 3 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
ప్రస్తుతం దేశంలో పాజిటివిటీ రేటు సగటున 21 శాతం ఉందని టాస్క్ ఫోర్స్ ప్రకటించినట్టు సమాచారం. ప్రధానంగా పుదుచ్చెరి, బెంగాల్, హర్యానా, కర్నాటక రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు చాలా ఎక్కువగా ఉందని చెప్పినట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో.. తెలంగాణలో 9 శాతం, ఆంధ్రాలో ఏకంగా 23 శాతం పాజిటివిటీ రేటు నమోదైనట్టు సమాచారం. 10 శాతం దాటిన రాష్ట్రాల్లో ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు లాక్ డౌన్ విధించాలని సూచించినట్టుగా తెలుస్తోంది.
దీంతో.. కేంద్రం లాక్ డౌన్ విధిస్తుందా? లేదా? అనే చర్చ సాగుతోంది. అయితే.. ఇప్పటికే దాదాపు 15 రాష్ట్రాలు దశలవారీ లాక్ డౌన్ ప్రకటించాయి. అమలు చేస్తున్నాయి. లాక్ డౌన్ నిర్ణయాన్ని కేంద్రం రాష్ట్రాలకే వదిలిపెట్టిన విషయం తెలిసిందే. దీంతో.. తమ రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులను బట్టి.. ఎవరి నిర్ణయం వాళ్లు తీసుకుంటున్నారు. అయితే.. దీనివల్ల పూర్తిస్థాయి ప్రభావం కనిపించదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్.. మరికొన్ని చోట్ల ఓపెన్ ఉండడంతో.. దేశం మొత్తంలో కొవిడ్ తగ్గుదల ఒకేవిధంగా నమోదు కాదని చెబుతున్నారు. అందువల్ల కేంద్రమే తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రస్తుత పరిస్థితిపై స్పందించిన ఐసీఎంఆర్.. ఇప్పటికైనా మేల్కోకపోతే భవిష్యత్ లో భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించినట్టు సమాచారం.
అయితే.. కేంద్రం లాక్ డౌన్ ప్రకటనలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు సమాచారం. దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటిస్తే.. రాష్ట్రాలకు ఎదురయ్యే ఆర్థిక నష్టాన్ని కేంద్రం కొంత భరించాల్సి ఉంటుంది. ఇందువల్లే.. లాక్ డౌన్ విధించట్లేదని, రాష్ట్రాలే చూసుకోవాలని చెప్పిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ.. దేశంలో కరోనా పరిస్థితి చూస్తే అల్లకల్లోలంగా తయారైంది. మరి, ఇలాంటి కండీషన్లో మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ప్రశ్న తలెత్తుతోంది.