తెలంగాణ పీసీసీ చీఫ్ నియామకంపై కాంగ్రెస్ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. టీపీసీసీ పదవీ కోసం కాంగ్రెస్ నేతలంతా లాబీయింగ్ చేస్తుండటంతో ఎన్నడూ లేనివిధంగా అధిష్టానం పీసీసీపై అభిప్రాయ సేకరణ చేపట్టింది.
తెలంగాణలోని అన్ని జిల్లాల కాంగ్రెస్ నేతలు.. ఇతర ముఖ్య నేతల నుంచి అభిప్రాయాలను సేకరించింది. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేపట్టింది. డిసెంబర్ 9నే కొత్త పీసీసీ ప్రకటన వస్తుందని భావించినా నేతల లాబీయింగ్ కారణంగా వాయిదా పడింది.
కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి వైపు మొగ్గుచూపుతుండగా తెలంగాణ నేతలు వ్యతిరేకిస్తున్నాయి. కాంగ్రెస్ చేపట్టిన అభిప్రాయ సేకరణలోనూ రేవంతే ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ కే పీసీసీ ఇస్తుందనే ప్రచారం జరుగుతోంది.
ఈక్రమంలోనే కాంగ్రెస్ లో సీనియర్ నేతలుగా కొనసాగుతున్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. మాజీ ఎంపీ వీహెచ్ హన్మంతరావులు కొత్తరాగం ఆలపిస్తుండటం చర్చనీయాశంగా మారింది. ఈ ఇద్దరు నేతలు తొలి నుంచి రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తూనే ఉన్నారు.
పీసీసీ పదవీని కాంగ్రెస్ లోని సీనియర్ నేతకే ఇవ్వాలని రేవంత్ ఇవ్వద్దని అధిష్టానాన్ని కోరుతున్నారు. కాగా పీసీసీని అధిష్టానం ప్రకటించకముందే వీరిద్దరు కాంగ్రెస్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడతామని చెప్పిన నేతలు ప్రస్తుతం ప్లేట్ ఫిరాయించడం ఆసక్తిని రేపుతోంది.
సోనియా.. రాహుల్ గాంధీలను ఎన్నడూ పల్లెత్తుమాట అనని జగ్గారెడ్డి ఇటీవల వారిపై అసంతృప్తిని వ్యక్తం చేశాడు. 2017లో రాహుల్ సభ కోసం తాను కోట్లు ఖర్చుపెట్టానని అయినా తన పేరు పీసీసీ రేసులో లేకపోవడం బాధ కలిగిందని వాపోయాడు.
గాంధీ ఫ్యామిలీకి వీరవిధేయుడిగా పేరున్న వీహెచ్ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. గతంలో 23మంది నాయకులు లేఖ రాస్తే పిలిచి మాట్లాడిన సోనియాగాంధీ.. ఇప్పుడు ఎన్ని లేఖలు రాసినా మేడమ్ స్పందించడం లేదని వాపోయాడు. రేవంత్ కు పీసీసీ ఇస్తే పార్టీ ఉండనంటూ స్పష్టం చేస్తున్నాడు.
పీసీసీ చీఫ్ రేవంత్ కు ఖాయమవడంతోనే ఆయన వ్యతిరేకంగా వర్గం పార్టీని వీడుతున్నామనే సంకేతాలను అధిష్టానానికి పంపుతున్నట్లుగా కన్పిస్తోంది. అయితే జగ్గారెడ్డి.. వీహెచ్ పాడుతున్న కొత్తరాగాన్ని ఇంకేంత మంది పాడుతారనేది మాత్రం వేచిచూడాల్సిందే..!