Homeఅత్యంత ప్రజాదరణవాహ్‌.. కేసీఆర్‌‌ మార్క్‌ షెడ్యూల్.‌!

వాహ్‌.. కేసీఆర్‌‌ మార్క్‌ షెడ్యూల్.‌!

KCR GHMC polls

దుబ్బాక ఉప ఎన్నిక తెలంగాణ అధికార టీఆర్‌‌ఎస్‌ పార్టీకి బాగానే గుణపాఠం నేర్పింది. ఈ ఉప ఎన్నికలో ఓటమితో టీఆర్‌‌ఎస్‌ పార్టీ అప్పుడిప్పుడే జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు పోదు అని అందరూ భావించారు. కానీ.. కేసీఆర్‌‌ మరోసారి తన మార్క్‌ రాజకీయం చూపారు. మరోసారి దుబ్బాక ఫలితం రిపీట్‌ కాకుండా జాగ్రత్త పడ్డారు. ఏకంగా ప్రతిపక్షాలను ఇరుకున పడేశారు. ప్రతిపక్షాలకు టైం ఇవ్వకుండా కోలుకోని దెబ్బతీయాలని ఆలోచన చేశారు.

Also Read: జీహెచ్ఎంసీ ఎన్నికలపై రగడ..ఈసీకి బీజేపీ ఫిర్యాదు

అందుకే.. అనుగుణంగానే వెంటవెంటనే ఏర్పాట్లు చేయించారు. ప్రతిపక్షాల అంచనాలను తలకిందులు చేశారు. మంగళవారం మీడియా ముందుకు వచ్చిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌‌ పార్థసారథి ఎట్టకేలకు జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించేశారు. ఎంత హడావుడిగా ఆయన షెడ్యూల్‌ ప్రకటించారో.. అంతే హడావుడిగా పోలింగ్‌ తేదీలను పెట్టారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా టఫ్‌ టైమ్‌లోనే ఈసారి ఎన్నికలను నిర్వహించబోతున్నారు.

ఈ రోజు మధ్యాహ్నమే షెడ్యూల్‌ ప్రకటించిన ఎన్నికల కమిషన్‌.. రేపటి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించింది. నవంబర్ 18 ,19, 20 తేదీల్లో నామినేషన్లు స్వీకరించి.. 21 పరిశీలించనున్నారు. 22న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్స్ విత్ డ్రాకు అవకాశం ఇస్తున్నారు. అదే రోజు అభ్యర్థులను ఫైనల్‌ చేయనున్నారు. డిసెంబర్ 1న  ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 4న ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటించనున్నారు. 3న అవసరమైతే రీపోలింగ్ నిర్వహించనున్నారు.

గ్రేటర్‌‌లో మొత్తం 74 లక్షల 4 వేల 286 ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 38 లక్షల 56 వేల 770  మంది, మహిళలలు 35 లక్షల 46 వేల 847 మంది, ఇతరులు 669 మంది,  పోలింగ్ కేంద్రాలు 9248 మంది ఉన్నారు. గ్రేటర్‌‌లో మొత్తంగా 150 వార్డులు ఉండగా.. గ్రేటర్‌‌లో అతి పెద్ద డివిజన్ మైలార్ దేవ్‌పల్లిలో 79 వేల 290 మంది ఓటర్లు ఉన్నారు. అతి చిన్న డివిజన్  రామచంద్రాపురంలో  27,948 మంది ఓటర్లు ఉన్నారు.

Also Read: అద్భుత దీపంపైనే కేసీఆర్ ఆశలు.. విజయశాంతి హాట్ కామెంట్స్‌

ప్రధానంగా ఈ షెడ్యూల్‌ను చూస్తే.. అధికార టీఆర్‌‌ఎస్‌ ప్రతిపక్షాలను టార్గెట్‌ చేసినట్లే కనిపిస్తోంది. దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్‌కు ముందు మూడు నెలలు సమయం దొరికింది. దీంతో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు మూడు నెలల ముందు నుంచే ప్రచారంలో మునిగిపోయారు. దాంతో ప్రజలందరినీ కలిసి ప్రభుత్వ వైఫల్యాలను చెప్పుకొచ్చారు. చివరగా సఫలీకృతమయ్యారు. సంచలనాత్మక విజయం సాధించారు.

అయితే.. అదే ఊపుతో గ్రేటర్‌‌లోనూ సత్తా చాటాలనుకున్న బీజేపీకి ఈ నోటిఫికేషన్‌ కాస్త ఇబ్బందుల్లో పడేసింది. మూడు రోజుల్లోనే నామినేషన్లకు గడువు పూర్తి చేయాలని ఈసీ నిర్ణయించింది. అంతేకాదు.. పోలింగ్‌కు కూడా 14 రోజుల సమయం మాత్రమే పెట్టింది. దీంతో ప్రతిపక్ష పార్టీలన్నీ తిరకాసులో పడ్డాయి. టీఆర్‌‌ఎస్‌ పార్టీకి క్యాండిడేట్ల బాధ పెద్దగా లేదు. ఎందుకంటే ఇప్పుడున్న సిట్టింగ్‌లోకే దాదాపు మళ్లీ బీ ఫామ్‌లు ఇచ్చేందుకు రెడీ అయిపోయింది. మహా అయితే ఓ పది మంది వరకు చేంజ్‌ చేస్తే.. ఆ పది మంది ఎంపిక పెద్ద ప్రక్రియ అయితే కాదు. కానీ.. ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు మాత్రం పెద్ద టాస్క్‌లా మారింది.

గ్రేటర్‌‌లో 150 డివిజన్లు ఉండగా.. ఇప్పటికిప్పుడు ఆయా పార్టీలు 150 మంది అభ్యర్థులను ఎంపిక చేయాలి. ఎంపిక చేయడమే కాదు వారికి వెంటవెంటనే బీ ఫామ్‌లు అందజేసి.. ఈ మూడు రోజుల్లోనే నామినేషన్లు వేయించాలి. ఆ వెంటనే ప్రచారంలోకి దిగాలి. మరి ఈ మూడు రోజుల్లో ఇదంతా జరిగే పనేనా..? కేవలం మూడు రోజుల్లోనే 150 అభ్యర్థులను ఎంపిక చేయడం నాట్‌ ఏ జోక్‌. అంతేకాదు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ ఎంపికయ్యాక దుబ్బాక ఉప ఎన్నికను ఫస్ట్ టైమ్‌ ఎదుర్కొన్నారు. అందులో సక్సెస్‌ కాగలిగారు. అందుకే.. ఈ ఎన్నికనూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇన్నాళ్లు గ్రేటర్‌‌లో ప్రచారంపైనే దృష్టి పెట్టిన బీజేపీ.. అభ్యర్థుల విషయంలో పెద్దగా ఆలోచించలేదు. అందుకే ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక బీజేపీ సవాల్‌గా మారింది. అంతేకాదు.. అధికార పార్టీ నుంచి ఎవరైనా టికెట్‌ ఆశించి దక్కకుంటే చివరికి బీజేపీలోకి వచ్చేస్తారని అనుకున్నారు. వారిని అక్కున చేర్చుకొని టికెట్‌ ఇద్దామని కూడా అనుకున్నారు. దీనికితోడు బీజేపీ తరఫున పోటీచేసే వారిని అప్లై చేసుకోవాలని ఇటీవలే దరఖాస్తులు కోరింది. ఇంకా ఆ ప్రాసెస్‌ నడుస్తూనే ఉంది. కానీ.. అది పూర్తయ్యే సమయం కూడా లేకుండా షెడ్యూల్‌ వచ్చింది. గ్రేటర్‌‌లో బీజేపీకి చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు కూడా ఉంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

ఇక కాంగ్రెస్‌ పార్టీకి కూడా అభ్యర్థుల ఎంపిక తలనొప్పిలా మారిందనే చెప్పాలి. సరే.. గతంలో జీహెచ్‌ఎంసీల అభ్యర్థుల్లో కొందరికి మళ్లీ టికెట్లు ఇచ్చినా.. ఇంకా మినిమం వంద మందికి పైగా అభ్యర్థులను అయితే సెలక్ట్‌ చేయాల్సి ఉంది. అంతేకాదు.. అసంతృప్తులను బుజ్జగించాల్సి ఉంటుంది. అంతకుమించి ఇప్పటికే ప్రతి ఎన్నికలోనూ అభాసుపాలవుతూ వస్తున్న కాంగ్రెస్‌కు.. గ్రేటర్‌‌లో అంతో ఇంతో ఓటు బ్యాంకు ఉంది. మరి దానిని కాపాడుకోవాలంటే అందుకు తగినట్లుగా అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే కాంగ్రెస్‌లో గ్రూపుల గలాటా నడుస్తూనే ఉంది. మరి ఈ క్రమంలో ఎవరు ఏ అభ్యర్థిని రెకమండ్‌ చేస్తారో ఎవరికీ తెలియదు. తాము చెప్పిన అభ్యర్థికి బీఫామ్‌ దక్కలేదని వారు అలకబూనినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరోవైపు ఈ ఎన్నికలు ఫ్యూచర్‌‌ కాంగ్రెస్‌ కోసం ఎంతో ఉపయోగపడనున్నాయి. ఫ్యూచర్‌‌లో పార్టీ భవిష్యత్‌నూ నిర్ణయించనున్నాయి. అందుకే.. ఈ ఎన్నికలు పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కు కూడా ప్రతిష్టాత్మకం కానున్నాయి. ఆయన తన పదవిని కాపాడుకోవాలంటే ఓ మాదిరి రిజల్ట్‌ సాధించాల్సిన పరిస్థితి ఉంది.

ఇక.. ఎంఐఎంకు ఎలాగూ అభ్యర్థుల ఎంపిక బాధలేదు. ఇక ఈ ఎన్నికల్లో బరిలో దిగుతామని సిద్ధపడుతున్న మరో రెండు పార్టీలు టీడీపీ, జనసేన. టీడీపీకి ఇప్పటికే క్యాడర్‌‌ లేదు. ఇక అభ్యర్థుల ఎంపిక ఎలా సాధ్యపడుతుంది. ఆ పార్టీ బీ ఫామ్‌ తీసుకునేందుకు ఎంత మంది ముందుకొస్తారో అనుమానమే. ఇక జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కూడా ఈ ఎన్నికల్లో బరిలో నిలుద్దామని అనుకున్నారు. హడావుడిగా షెడ్యూల్‌ రావడంతో మరి ఇప్పుడు ఈ నిర్ణయానికి కట్టుబడుతారా..? లేక పోటీ నుంచి తప్పుకుంటారా అనేది తెలియకుండా ఉంది. మొత్తంగా చూస్తే ప్రతిపక్షాలను గట్టి దెబ్బతీయడానికే అధికార పక్షం ఈ కుట్రకు తెరలేపిందనేది రాజకీయ నిపుణులు అంటున్నారు.

-శ్రీనివాస్. బి

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

1 COMMENT

Comments are closed.

RELATED ARTICLES

Most Popular