
బాహ్య సౌందర్యం అందరికీ ఉంటుంది.. ఆత్మసౌందర్యం మాత్రం కొందరికే ఉంటుంది. కానీ.. ఇవి రెండూ కలిసిన అందాల చందమామ కాజల్. అవసరాల్లో ఉన్నవారిని, ఆపదలో ఉన్నవారిని ఇప్పటి వరకు పలు మార్లు ఆదుకున్న కాజల్.. తాజాగా మరో అభిమానికి భారీగా డబ్బు సహాయం చేసింది. దీంతో.. చందమామ మనసు ఎంత చల్లదో మరోసారి తెలిసి వచ్చింది.
సుమ అనే ఒక అమ్మాయి తన పరిస్థితిని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తన అవసరాన్ని తెలియజేసి, ఆదుకోవాలని అందరినీ కోరింది. ప్రస్తుతం తాను ఎం.ఫార్మసీ చదువుతున్నానని, ఈ మధ్యనే తన జాబ్ పోయిందని వెల్లడించింది. పరీక్ష ఫీజుకోసం చాలా డబ్బులు అవసరం ఉందని, ఎవరైనా సహాయం చేయాలని వేడుకొంది.
తన పరీక్ష ఫీజు కోసం మొత్తం 83 వేల రూపాయలు చెల్లించాల్సి ఉందని చెప్పింది. అవి చెల్లించకపోతే తనను పరీక్షకు అనుమతించరని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయం తెలుసుకున్న కాజల్.. అది నిజమేనా అని తన టీమ్ ద్వారా ఆరాతీసింది.
రంగంలోకి దిగిన టీమ్ అమ్మాయి పరిస్థితి గురించి ఆరాతీసింది. దీంతో.. తాను కష్టాల్లో ఉన్న విషయం నిజమేనని తేలింది. దీంతో.. వెంటనే అమ్మాయి అకౌంట్ కు లక్ష రూపాయలు పంపించింది. అది కూడా గూగుల్ పే ద్వారా ట్రాన్స్ ఫర్ చేసిందీ బ్యూటీ. ఈ విషయం స్క్రీన్ షాట్ తో సహా సోషల్ మీడియాలోకి రావడంతో.. కాజల్ అందమైన మనసును తెగ మెచ్చుకుంటున్నారు ఫ్యాన్స్.