ఏపీ జనాభాలో ప్రబలంగా.. రాజకీయాలను మార్చేలా ఉన్న కాపులు ఎందుకు అధికారంలోకి రాలేకపోతున్నారు. వీరికంటే తక్కువగా ఉన్న రెడ్లు, కమ్మల చేతుల్లో ఎందుకు ద్వితీయ శ్రేణి నేతలుగా మారిపోతున్నారు. కాపులకు రాజ్యాధికారం ఎందుకు దక్కడం లేదు. మెగాస్టార్ చిరంజీవి కాపుల కోసం వచ్చాడు. కానీ బలంగా ఉన్న కమ్మలు, రెడ్ల కుళ్లు రాజకీయాలకు తాళలేక ప్రజారాజ్యం కాడి వదిలేసి కాంగ్రెస్ లో కలిపేసి రాజకీయ సన్యాసం చేశాడు. ఇక ఆయన తమ్ముడు పవన్ వచ్చాడు. ధైర్యంగానే నిలబడుతున్నాడు. కానీ మొదటే టీడీపీకి అనుకూలంగా రాజకీయం చేసి కాపులకు దూరమయ్యాడే అపవాదును మూటగట్టుకున్నాడు. ఇప్పుడు బీజేపీ తరుఫున సోము వీర్రాజు కూడా వచ్చాడు. ఎందరో వస్తున్నా కాపుల్లో వారికి ప్రాధాన్యత కరువైంది. వారిని ఆ సామాజికవర్గం ఓన్ చేసుకోవడం లేదు. ఎందుకు కాపులకు ఈ గతి? వారెందుకు రాజకీయంగా ఎదగడం లేదు. కాపుల ఆశాకిరణం పవన్ ను, జనసేనను కాపులు ఎందుకు నమ్మడం లేదు? ఇలాంటి ప్రశ్నలన్నింటికి సమాధానాలు వెతుకుదాం..
భారతదేశ రాజకీయాలు కులాల రంగు పులుముకున్నాక దానిపై విస్తృతమైన అవగాహన ఉన్న రామమనోహర్ లోహియా కాపు కులం రాజ్యాధికారం సాధించడానికి ఇంకా ఎక్కువ సమయం తీసుకోదని చెప్పాడు. కానీ తమిళనాడులో ఎంజీఆర్, ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ లు అధికారంలోకి రావడం చూసిన కాపులు తమ కులంలో అత్యంత ప్రజాదరణ గల మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలలోకి వచ్చి రాజ్యాధికారం చేపట్టాలని తలంచారు. దానిఫలితమే ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు. ఎన్టీఆర్ పార్టీ ఏర్పాటు నాటి పరిస్థితులు, ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటునాటి పరిస్థితులు బేరీజు వేయడంలో ప్రజారాజ్యం పార్టీ నేతలు విఫలమయ్యారు. కాంగ్రెస్, టీడీపీ పార్టీలకు నాయకత్వం వహిస్తున్న రెడ్లు, కమ్మల ఎత్తుగడలను పసిగట్టడంలో పీఆర్పీ నేతల అనుభవం చాలలేదు. అదీగాక పాలక కులాలైన రెడ్డి, కమ్మల యొక్క కుల స్వభావాన్ని శతృత్వ భావంతో చూడకుండా స్నేహపూరిత వైఖరితో చూశారు.
ఉదాహరణకు చిరంజీవిగారు పీఆర్పీ ఏర్పాటు సభలోనే తనకి చంద్రబాబు, వైఎస్ రాజశేఖరరెడ్డి ఇద్దరూ మితృలే అని చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి సున్నిత మనస్కుడవడంతో అతని నోట ఆ మాటలు వచ్చాయి. కానీ రాజకీయాలలో ఇలాంటి సున్నిత మనస్థత్వం పనికిరాదు. పీఆర్పీ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ, టీడీపీ కోవర్టుల ప్రవేశం కూడా భారీగానే జరిగింది. అదీగాక పీఆర్పీలో ఉన్న కొందరు ఇతర పార్టీలకు ముఖ్యంగా కాంగ్రెస్ కు అమ్ముడు పోయినవారూ ఉన్నారు. పార్టీ ఎత్తుగడలు అంతర్గత వ్యవహారాలు ప్రత్యర్థులకు తెలిసిపోయాయి. 2009 ఎన్నికలలో మీడియా కూడా పీఆర్పీకి వ్యతిరేకంగా పనిచేసింది. మీడియాలో ప్రచారమవుతున్న అసత్యాలను తిప్పికొట్టడంలో పార్టీ విఫలమైంది. మీడియా చెప్పే అబద్దాలే నిజమని ప్రజలు నమ్మే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అందునా వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనపై.. ఆయన అమలు చేసిన సంక్షేమ పధకాలు వలన ప్రజలలో మంచి అభిప్రాయం అప్పుడు ఉంది. వెరసి ప్రజారాజ్యం పార్టీ విజయం సాధించలేక పోయింది. అయినా 74 లక్షల ఓట్లు సాధించి కాపులకు ఆశాదీపంలా నిలిచింది.
పీఆర్పీలో గెలిచిన 18మంది ఎమ్మెల్యేలలో పార్టీ కంటే వ్యక్తిగత స్వార్ధం చూసుకొనేవారే ఎక్కువమంది ఉన్నారు. వారంతా అధికారపార్టీలో చేరడానికి సిద్థమైపోయారు. ఈ దశలో చిరంజీవి కూడా తను పార్టీ నడపలేననే పరిస్థితికి వచ్చాడు. ఫలితం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి చేతులు దులుపుకున్నారు. ఈ విధంగా కాపుల రాజ్యాధికారం కల కల్లగా మారిపోయింది.
2014 వచ్చేసరికి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించి కాపులలో మళ్లీ కొత్త ఆశలు చిగురింపజేశాడు. కారణాలేవైనా కాపుజాతిలో జనసేన పార్టీ పట్ల నిరాసక్తత ఏర్పడింది. అధినాయకుడి నిర్ణయాలు చంద్రబాబు పట్ల ఉదాశీన వైఖరితో ఉండడంతో కాపుజాతి జీర్ణించుకోలేక పోయింది. రాజకీయాల్లో వైరుధ్యాలను సరిగ్గా అంచనా వేయలేకపోయారు. ప్రజారాజ్యం పార్టీకి 60% కాపుల ఓట్లు పడితే.. జనసేన పార్టీకి 10% లోపే పడ్డాయి. కాపు ఓటు బ్యాంకు ఛిన్నాభిన్నమైంది.
పై పరిణామాల నుండి గుణపాఠాలు నేర్వడానికి జనసేన పార్టీ సిద్థంగా లేదు. తప్పంతా ప్రజలపై నెట్టేసి చేతులు దులుపుకుంటున్నారు. నేటికీ పార్టీ నిర్మాణం చేసుకోకుండా కాలం వెళ్లబుచ్చుతున్నారు. కొత్తతరం నాయకుల్ని తయారు చేస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ నేటి వరకు తయారు చేసిన నాయకులు స్త్రీలోరులు, ఆర్థిక అరాచకవాదులు, రౌడీలుగా ముద్రపడినవారనే విమర్శలున్నాయి.. వారి కార్యకలాపాలపై పవన్ కళ్యాణ్ గారికి రిపోర్టు చేసినా పట్టించుకోని పరిస్థితి. ఆయన తయారు చేసిన నాయకులపై జనసేన పార్టీ అభిమానులు లైవ్ వీడియోలద్వారా బహిరంగ పరిచినా సమాధానం చెప్పలేని పరిస్థితి.
నాయకులు ఉద్యమాలనుంచి తయారవుతారనేది జగమెరిగిన సత్యం. అలా కాకుండా జనసేనలో మాత్రం పవన్ కళ్యాణ్ తనకు నచ్చినవాడిని నాయకుడిగా ప్రకటిస్తే వాడు ఎంత వైధవైనా, అసమర్థుడైనా పార్టీ శ్రేణులు విధిగా వారిని ఆమోదించి వారికింద పని చేయాలి. అలా ఆ నాయకుల్ని ఆమోదించనివారు నిరభ్యంతరంగా పార్టీని వీడిపోవచ్చు. ఒకవేళ వారు వెళ్ళకపోయినా పొగబెట్టి బయటకి సాగనంపుతారు. ప్రజలకోసం పనిచేసే పార్టీ ఏదైనా ప్రజల మనోభావాలకూ, పార్టీ శ్రేణుల అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకుంటాయి. కానీ ఈ పార్టీ దీనికి రివర్స్ లో నడుస్తోంది. నాయకుడి మాటను గ్రుడ్డిగా అనుకరించడమే ఇక్కడ క్రమశిక్షణ.
ఇవన్నీకాక పార్టీ ప్రతినిధులు చివరికి పవన్ కళ్యాణ్ కు కూడా అబద్దాలు చెప్పడం. పవన్ కళ్యాణ్ లక్షలాదిమంది కార్యకర్తల్ని తయారుచేశామని మీడియాముందు చెబితే వారి అధికార ప్రతినిధులు మరో అడుగు ముందుకేసి “11 లక్షల జనసైన్యాన్ని తయారు చేశామ”ని అబద్దం చెప్తారు.
మొత్తం మీద ఒక గమ్యంలేని పార్టీగా జనసేన కనపడుతుంది. మూస పార్టీలకు భిన్నంగా జనంకోసమే తయారు చేయబడ్డ పార్టీ, తమకి ఏవో సిద్థాంతాలున్నాయని చెప్పే పార్టీకి అసలు సిద్థాంతాలు లేకపోగా మూస పార్టీలకన్నా అధ్వాన్న స్థితిలో ఉంది. ఈ లెక్కన ఈ పార్టీ అధికారం సాధించడానికి 25 సంవత్సరాలు కాదుకదా 25 శతాబ్దాలు కూడా చాలదు.
–కేఎన్
Note: Views expressed by author are his own, not of publishers
రచయిత అభిప్రాయాలు తన వ్యక్తిగతం, వెబ్ సైట్ సంపాదకవర్గానికి సంబంధం లేదు