ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. సోమవారం షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. రోడ్డు సమస్యపై గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబును నిలదీసిన జనసేన పార్టీ కార్యకర్త బండ్ల వెంగయ్యనాయుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గ్రామంలోని రోడ్డు సమస్యపై నడిరోడ్డుపై ఎమ్మెల్యే రాంబాబు కారు ఆపి నిలదీశాడు.
దీంతో సీరియస్ అయిన వైసీపీ ఎమ్మెల్యే రాంబాబు జనసేన కార్యకర్తను చెడామడా తిట్టేసి ‘నువ్వెవుడి రా నాకు చెప్పడానికి.. తమాషాగా ఉందా.. ఒళ్లు దగ్గరపెట్టుకో.. నన్నే ప్రశ్నిస్తావా? నా వద్దకు వస్తూ మెడలో ఆ కండువా ఏంటి? కండువా తీసేయ్ ముందు.. ఆ తర్వాత మాట్లాడు’ అంటూ గిద్దలూరు ఎమ్మెల్యే నిప్పులు చెరిగారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ క్రమంలోనే ఎమ్మెల్యేను నిలదీసిన జనసేన కార్యకర్తకు ఒత్తిళ్లు రావడంతో అతడు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. దీనిపై జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించాడు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశాడు.
Also Read: వెడ్డింగ్ కార్డ్ పై క్యూఆర్ కోడ్.. చదివింపులు నేరుగా ఖాతాలోకి..?
సమస్యలపై ప్రశ్నిస్తే ప్రాణాలు పోగొట్టుకోవాల్సిందేనా? అని పవన్ కళ్యాణ్ భావోద్వేగంతో ప్రశ్నించారు. జనసేన కార్యకర్త బండ్ల వెంగయ్యనాయుడు ఆత్మహత్య బాధాకరమని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వెంగయ్య ఆత్మహత్యకు అధికార పక్షం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
పారిశుధ్యసమస్యపై ఎమ్మెల్యేను ప్రశ్నించడం తప్పా? ఎమ్మెల్యే రాంబాబు ‘నీ మెడలో పార్టీ కండువా తీయ్’ అని దారుణంగా తిడుతాడా? అని పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. ప్రశ్నించిన యువకుడిని వివిధ రూపాల్లో ఒత్తిళ్లకు గురిచేసినట్లు మాకు సమాచారం అందిందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
Also Read: వైరల్ : లక్ష్మీపార్వతి ఇంట చిన్న ఎన్టీఆర్ వచ్చాడు!
సమస్యలపై ప్రశ్నించడమే వెంగయ్య నాయుడు చేసిన తప్పా? అని పవన్ కళ్యాణ్ నిలదీశారు. ఊరి ప్రజలందరి కోసం అతడు మాట్లాడారని పేర్కొన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేకు ఎందుకు భయం పుట్టిందని పవన్ ప్రశ్నించారు.
వెంగయ్యనాయుడు మరణంపై సమగ్ర విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. అధికారపక్షం ఈ ఆత్మహత్యకు బాధ్యత వహించాలన్నారు. వెంగయ్య ఆత్మహత్యకు ప్రేరేపించిన ఎమ్మెల్యే, ఆయన అనుచరులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పవన్ డిమాండ్ చేశారు. వెంగయ్య కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని జనసేనాని పవన్ భరోసా ఇచ్చారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
గ్రామంలో పారిశుధ్య సమస్య తీర్చమని అడిగినా
ప్రాణాలు పోగొట్టుకోవాల్సిందేనా? – JanaSena Chief Sri @PawanKalyan pic.twitter.com/Nas7mb0edg— JanaSena Party (@JanaSenaParty) January 18, 2021