టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ సీఎం జగన్ కుటుంబాన్ని టార్గెట్ చేశారు. వారి ఇంట్లోని పంచాయతీని వీధినపెట్టారు. చాకచక్యంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం జగన్ పరువును బజారుకీడ్చే బాధ్యతను భుజానకెత్తుకున్నాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజాగా కర్నూలులో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిలకు ఆస్తులు, పదవులు ఇవ్వకుండా సీఎం జగన్ మోసం చేశారని.. అందుకే షర్మిల తెలంగాణలో రోడ్డుపై పడిందని చంద్రబాబు ఆరోపించారు.
జగన్ పిరికిపంద అంటూ చంద్రబాబు ఆరోపించారు. జగన్ కు దమ్ముంటే తన విమర్శలకు సమాధానం చెప్పాలని సవాల్ చేశారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో దోషి ఎవరో ప్రజలకు తెలుసు అన్నారు. ఏం పీకారాని జగన్ కు ఓటేస్తారని.. ఆయనకు దమ్ముంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలకు రావాలని చంద్రబాబు అన్నారు.
ఏం మాట్లాడినా ఏపీలో పోలీసులు ఇంటికి వస్తున్నారని.. పోలీసులను పెట్టి జగన్ సర్కార్ ప్రజలను భయపెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఏపీలో ఏబీసీడీ పాలన సాగుతోందంటూ ధ్వజమెత్తారు. అట్రాసిటీ, బాదుడు, కరప్షన్, డీమాలిషన్ విధ్వంసం అంటూ ఏబీసీడీ పాలనను వర్గీకరించారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై శుక్రవారం మార్చి 5న తలపెట్టిన ఏపీ బంద్ కు టీడీపీ మద్దతు తెలుపుతున్నట్టు చంద్రబాబు ప్రకటించారు.