కొన్ని కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడే మాటలు మనకు ఇబ్బందులు తెచ్చిపెడుతాయి. అందులోనూ ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్న వారు మాత్రం ఆచితూచి మాట్లాడడమే మంచిది. మితిమీరిన ఆత్మవిశ్వాసం కూడా ఒక్కోసారి దెబ్బతీస్తుంటుంది. దానికి భారీ మూల్యం కూడా చెల్లించుకోవాల్సి వస్తుంది. అది ఎంతలా అంటే.. ఇన్నాళ్లు కాపాడుకున్న ఇమేజీ కాస్త ఆ దెబ్బతో గంగలో కలుస్తుంది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అనుకోని దెబ్బ ఎదురవుతోంది. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా అనవసరంగా బీజేపీని గెలికి ఆ పార్టీకి ఇమేజీని తెచ్చిపెట్టారు. ఆ నియోజకవర్గంలో ఎక్కడో మూడో స్థానంలో నిలుస్తుందని అనుకున్నా.. ఇప్పుడు సెకండ్ ప్లేస్‌కు నిలిచేలా కనిపిస్తోంది. ఒకవేళ ఫలితాలు కొంచెం అటు ఇటైనా బీజేపీ గెలిచే పరిస్థితులే ఉన్నాయి.
Also Read: తెలంగాణలో మంచినీరు తాగి ఒకరు మృతి.. 11 మందికి..?
ఇందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన తప్పేనని చెప్పక తప్పదు. కాంగ్రెస్‌ను పక్కకు తప్పించేందుకు.. బీజేపీని తెర మీదకు తీసుకొచ్చి.. దిద్దుకోలేని తప్పు చేశారన్న మాట బలంగా వినిపిస్తోంది. గడిచిన కొద్దికాలంగా రాజకీయంగా తిరుగులేని రీతిలో చెలరేగిపోయిన ఆయన.. దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా అనుసరించిన వ్యూహం ఎదురుదెబ్బ కొట్టే ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు.
రాష్ట్రం ఏర్పాటు నుంచి ఏ ఎన్నికలు జరిగినా టీఆర్‌ఎస్‌కు తిరుగులేని విజయాలే లభించాయి. ఇటీవల కాలంలో తమకు ప్రత్యర్థి బీజేపీ అన్నట్లుగా అధికార పార్టీ వ్యవహరిస్తుండడంతో ఆ ఉద్దేశం కాస్త బీజేపీకి పాజిటివ్‌లా మారింది. దీంతో కేసీఆర్‌కూ ఫ్యూచర్‌లో భారీ నష్టమే మిగుల్చుతుందని నిపుణులు అంటున్నారు. ఇప్పుడు దుబ్బాక పుణ్యమా అని ఇన్నాళ్లు రాష్ట్రంలో బలమైన ప్రత్యర్థి లేరనుకున్న అధికార పార్టీకి.. బీజేపీ గుదిబండలా తయారైంది. ఇక మున్ముందు కూడా కేసీఆర్ మీద గుర్రుగా ఉన్న సొంత పార్టీ నేతలు సైతం బీజేపీలోకి జంప్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారట.
Also Read: దీపావళి పండుగ జరుపుకునే వారికి అలర్ట్.. వాటిపై నిషేధం..?
ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ తన సత్తా చూపిస్తోంది. ఈ బలానికి తోడు అదనపు బలం వచ్చి చేరితే ఇక ఆ పార్టీకి తిరుగుండదు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలు పలువురు టీఆర్ఎస్‌లోకి వెళ్లిపోవటంతో ఆ పార్టీ బలహీన పడింది. ఈ టైంలో కొత్త ఉత్సాహంతో దూసుకెళుతున్న బీజేపీకి దుబ్బాక ఒక బలవర్థకమైన టానిక్‌గా మారింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలవకున్నా ఫర్లేదు.. టీఆర్ఎస్‌ను ఎదిరించే సత్తా తమకుందన్న సందేశాన్ని ఇచ్చేలా ఫలితం ఉంటే చాలంటున్నారు.