
అపర చాణక్యుడు కేసీఆర్ తో రాజకీయం చేయడం అంత సులువు కాదంటారు. పూర్తిగా కనుమరుగైన తెలంగాణ ఉద్యమాన్ని పైకి లేపి పట్టాలెక్కించి రాష్ట్రాన్ని సాధించిన ఘనుడు ఆయన. ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ కు ఎదురుగాలి వీస్తోంది. దుబ్బాకలో ఓటమి.. జీహెచ్ఎంసీలోనూ అదే ఎదురుదెబ్బలు ఇప్పుడు టీఆర్ఎస్ ను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
తాజాగా ఉరుము లేని పిడుగులా తెలంగాణలో షర్మిల దూసుకొచ్చింది. ఏపీ సీఎం జగన్ చెల్లెలు ఇక్కడ పార్టీ పెట్టడమే ఒక ఆశ్చర్యం.. ఏపీ మూలాలున్న ఈమె జగన్ కు వ్యతిరేకంగా తెలంగాణలో పార్టీని నడిపిస్తామనడం అందరినీ షాక్ కు గురిచేసింది. అసలు ఏంటీ రాజకీయం? తెరవెనుక ఏమైనా మతలబు ఉందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
షర్మిల పార్టీ కేసీఆర్, కేటీఆర్ సహా ఏ ఒక్క టీఆర్ఎస్ నేత స్పందించలేదు. కామెంట్స్ చేయలేదు. కాంగ్రెస్, బీజేపీ నేతలు షర్మిల తెలంగాణలో ఏం సాధించలేదని ఈసడించినా కేసీఆర్ బ్యాచ్ మాత్రం మౌనం వీడలేదు.
తాజాగా రేవంత్ రెడ్డి దీనిపై హాట్ కామెంట్స్ చేశారు. . వైఎస్ఆర్ కు తెలంగాణలో అభిమానులున్న మాట వాస్తవమేనని.. అయితే అంతమాత్రాన షర్మిల పార్టీ పెడితే అంగీకరించరని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల పార్టీపై సీఎం కేసీఆర్ ఎందుకు నోరు మెదపడం లేదని.. కేసీఆర్ వ్యతిరేక ఓట్లు చీల్చేందుకే పార్టీ పెడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోందన్నారు.
దీన్ని ప్రభుత్వంపై పెరిగిన వ్యతిరేక ఓటును చీల్చడానికే కేసీఆర్ తన మిత్రుడు ఏపీ సీఎంతో కలిసి ఆమె చెల్లెలిని తెలంగాణ పాలిటిక్స్ లో దించాడని.. దీనివెనక కేసీఆర్ రాజకీయ చాణక్యం ఉందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.