ఎమ్మెల్సీ: టీఆర్ఎస్ గెలుపు వెనుక బోగస్ ఓట్లేనా?

‘‘దుబ్బాక, జీహెచ్ఎంసీలో సత్తా చాటిన బీజేపీ పట్టభద్రుల ఎన్నికలకు వచ్చేసరికి ఎందుకు తేలిపోయింది. తెలంగాణ ఏర్పడి ఏడేళ్లు అవుతున్న ఉద్యోగ ప్రకటనలు ఇవ్వకుండా.. ఒక్క డీఎస్సీ కూడా వేయకున్నా కూడా అదే టీఆర్ఎస్ కు పట్టభద్రులు ఎందుకు ఓటు వేశారు.? ఉద్యోగ ప్రకటనలు లేవని టీఆర్ఎస్ అంటేనే మండిపడుతున్న గ్రాడ్యూయేట్లు తాజాగా జరుగుతున్న పట్టభద్రుల ఎన్నికల్లో అదే అధికార పార్టీని ఎలా గెలిపిస్తున్నారు.? యువత మొత్తం బీజేపీ వైపే ఉంటే టీఆర్ఎస్ కు ఎలా ఓట్లు పడుతున్నాయి? […]

Written By: NARESH, Updated On : March 20, 2021 2:42 pm
Follow us on

‘‘దుబ్బాక, జీహెచ్ఎంసీలో సత్తా చాటిన బీజేపీ పట్టభద్రుల ఎన్నికలకు వచ్చేసరికి ఎందుకు తేలిపోయింది. తెలంగాణ ఏర్పడి ఏడేళ్లు అవుతున్న ఉద్యోగ ప్రకటనలు ఇవ్వకుండా.. ఒక్క డీఎస్సీ కూడా వేయకున్నా కూడా అదే టీఆర్ఎస్ కు పట్టభద్రులు ఎందుకు ఓటు వేశారు.? ఉద్యోగ ప్రకటనలు లేవని టీఆర్ఎస్ అంటేనే మండిపడుతున్న గ్రాడ్యూయేట్లు తాజాగా జరుగుతున్న పట్టభద్రుల ఎన్నికల్లో అదే అధికార పార్టీని ఎలా గెలిపిస్తున్నారు.? యువత మొత్తం బీజేపీ వైపే ఉంటే టీఆర్ఎస్ కు ఎలా ఓట్లు పడుతున్నాయి? ’’ ఇప్పుడీ ప్రశ్నలన్నీ తెలంగాణ రాజకీయ వర్గాల్లో మెదులుతున్నాయి. నేతల మెదళ్లను తొలుస్తున్నాయి. ఆది నుంచి గ్రాడ్యూయేట్లతో సహవాసం నెరుపుతున్న బీజేపీ లేదంటే ప్రొఫెసర్లు కోదండరాం, నాగేశ్వర్, తీన్మార్ మల్లన్న లాంటి బలమైన గొంతుకలు గెలవాల్సిన చోట కూడా టీఆర్ఎస్ అభ్యర్థులు ఎలా గెలుస్తారన్నది ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్నగా మారింది.?

నిరుద్యోగులు, ఉద్యోగులను పట్టించుకోని కేసీఆర్ సర్కార్ పై ఆ వర్గం చాలా వ్యతిరేకతతో ఉంది. ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వకుండా.. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రకటనలు ఇవ్వకుండా విసిగిస్తున్న కేసీఆర్ ను తాజాగా దుబ్బాక, జీహెచ్ఎంసీలో యువకులే ఓడించారని.. కసిగా బీజేపీకి సపోర్టు చేశారని ప్రచారం సాగింది. డబ్బులకు అమ్ముడుపోని.. పోనీ పోయినా కూడా తీసుకొని మరీ వేయని మేధావి వర్గం యువత, ఉద్యోగులు. అందుకే పోయినసారి ఎందరు నిలబడ్డ ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి మేధావిని ఎమ్మెల్సీగా గెలిపించారు. అలాంటి వారు ఈసారి టీఆర్ఎస్ కు ఎందుకు వేశారన్నది హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఈ ప్రశ్నలకు తాజాగా కాంగ్రెస్ హైదరాబాద్-రంగారెడ్డి -మహబూబ్ నగర్ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి జవాబిచ్చారు. ఒకరకంగా బాంబు పేల్చారనే చెప్పాలి. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఓటమి తర్వాత టీఆర్ఎస్ అలెర్ట్ అయ్యిందని.. పెద్ద ఎత్తున టీఆర్ఎస్ కార్యకర్తలతో ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించి పట్టభద్రులుగా ఓటర్లుగా మార్చారని.. వారే గంపగుత్తగా టీఆర్ఎస్ కు వేసి గెలిపిస్తున్నారని చిన్నారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అందుకే చెల్లని ఓట్లు బాగా బయటపడ్డాయని.. చాలా మంది నిజమైన గ్రాడ్యుయేట్ల ఓట్లను తొలగించారని.. టీఆర్ఎస్ కార్యకర్తలతో తప్పుడు సర్టిఫికెట్లు పెట్టి గ్రాడ్యూయేట్ ఓటర్లుగా మార్చి పెద్ద మాయ చేశారని సంచలన ఆరోపణలు చేశారు.

నిజంగా పట్టభద్రులు వేస్తే టీఆర్ఎస్ గెలిచేది కాదని మాజీ మంత్రి చిన్నారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను చెక్ చేయాలని.. ఏదో గోల్ మాల్ జరిగింది కాబట్టే ఆ పార్టీ గెలుస్తుందన్నారు. చాలా మంది గ్రాడ్యుయేట్ల ఓట్లు చెల్లకపోవడం.. తప్పుగా పడడం వెనుక ఈ ఫేక్ ఓటర్లు ఉన్నారని చిన్నారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. చదువురాని వారిని కూడా గ్రాడ్యుయేట్ ఓటర్లుగా మార్చారని.. అందుకే చాలా ఓట్లు చెల్లకుండా పోయాయని చిన్నారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.

టీఆర్ఎస్ గెలుపునకు ఫేక్ ఓట్లు కారణమన్న చిన్నారెడ్డి ఆరోపణలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. నిజంగా అంత వ్యతిరేకత ఉన్న గులాబీ పార్టీని గ్రాడ్యూయేట్లు గెలిపించరన్న వాదన అందరిలో ఉంది. మరి ఈ ఫలితాల సరళి చూస్తే చిన్నారెడ్డి ఆరోపణలకు బలం చేకూరే విధంగానే పరిస్థితి ఉందని అర్థమవుతోంది. ఈ ఆరోపణలపై అధికార టీఆర్ఎస్ పార్టీ స్పందించాల్సి ఉంది.