
India Vs England: ఇంగ్లండ్(England)తో జరుగుతున్న రెండో టెస్టులో అద్వితీయంగా గెలిచి.. మూడో టెస్టులో అంతే చిత్తుగా ఓడిపోయి విమర్శల పాలైంది టీమిండియా(India). కేవలం 78 పరుగులకే ఆలౌట్ అయ్యి ఘోర పరాజయాన్ని చవిచూసింది. ప్రధాన బ్యాట్స్ మెన్ అంతా క్యూ కట్టారు. ఎవ్వరూ పోరాడలేదు. దీంతో కీలకమైన నాలుగో టెస్టు నెగ్గడం ఇప్పుడు కోహ్లీ సేనకు చాలా ముఖ్యంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అందరి దృష్టి జట్టు ఎంపికైనే పడింది. ఫామ్ లో లేని వారిని తొలిగించి కొత్త వారికి అవకాశం ఇస్తారా? లేదా? అన్నది ఆసక్తి రేపుతోంది.
ముఖ్యంగా టీమిండియాకు ఆల్ రౌండర్ జడేజా గాయపడడంతో అతడి స్థానంలో స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్ ను ఆడిస్తుందా? లేదా అన్న విషయం ఆసక్తిరేపుతోంది. లీడ్స్ లో 78 పరుగులకే ఆలౌట్ అయిన భారత్.. నాలుగో రోజు చివరి 8 వికెట్లను కేవలం 63 పరుగులకే కోల్పోయింది. అదనపు బ్యాట్స్ మెన్ తీసుకోవాలా? లేదా ? అన్నది నిర్ణయిస్తామని కోహ్లీ సైతం మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు.
ప్రస్తుతం జట్టులో నలుగురు స్పెషలిస్ట్ బౌలర్లు.. ఆల్ రౌండర్ జడేజా ఉన్నాడు. జడేజాకు గాయం కావడంతో పూర్తి ఫిట్ నెస్ సాధించకపోతే అదనపు బ్యాట్స్ మెన్ ను ఆడిస్తారని తెలుస్తోంది. జడేజా ఆడకపోతే స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్ నే ఆడించే అవకాశాలు ఉన్నాయి.
ప్రస్తుతం వికెట్ కీపర్ రిషబ్ పంత్, అజింక్య రహానేలు పేలవ ఫామ్ లో ఉన్నారు. వీరి స్థానంలో ఖచ్చితంగా మాయంక్ అగర్వాల్, పంత్ లను తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కేఎల్ రాహుల్ ను మిడిల్ ఆర్డర్ కు మార్చి రోహిత్ కు జోడీగా మాయాంక్ లేదా ఫృథ్వీని బరిలోకి దించవచ్చని చెబుతున్నారు. ఇక ఆఫ్ స్పిన్ కూడా వేయగల హనుమ విహారిని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
దీన్ని బట్టి 4వ టెస్టుకు టీమిండియాలో సమూల మార్పులు తథ్యం అంటున్నారు. ఎవరిని తీసుకుంటారో? ఎవరిని తీసుకోరా? అన్నది ఆసక్తిగా మారింది..