మహానగరం.. మళ్లీ మునిగింది..ఈ పాపం ఎవరిది?

అదో మహానగరం.. దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న సిటీ. ఎన్నో అంతర్జాతీయ అవార్డులు.. మరెన్నో జాతీయ అవార్డులు ఈ సిటీకి సొంతం. కానీ.. ఏంలాభం ఒక్క వాన పడితే జల సాగరం అవుతోంది. ఇదీ మన హైదరాబాద్‌ నగర దుస్థితి. శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్‌ ఆగమాగమైంది. ఏ రోడ్డు చూసినా చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. నాలా గోడలు కూలిపోయాయి. నాలాలు ఉప్పొంగాయి. వరద నీటితో ఇళ్లన్నీ జలమయం […]

Written By: NARESH, Updated On : October 10, 2020 10:12 am
Follow us on

అదో మహానగరం.. దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న సిటీ. ఎన్నో అంతర్జాతీయ అవార్డులు.. మరెన్నో జాతీయ అవార్డులు ఈ సిటీకి సొంతం. కానీ.. ఏంలాభం ఒక్క వాన పడితే జల సాగరం అవుతోంది. ఇదీ మన హైదరాబాద్‌ నగర దుస్థితి. శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్‌ ఆగమాగమైంది. ఏ రోడ్డు చూసినా చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. నాలా గోడలు కూలిపోయాయి. నాలాలు ఉప్పొంగాయి. వరద నీటితో ఇళ్లన్నీ జలమయం అయ్యాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక మురికి నీరంతా ఇళ్లలోకి చేరింది. పలుచోట్ల అంధకారం.

Also Read: తెలంగాణలో వింత సొరకాయ.. ఎంత పొడవో తెలుసా..?

మరోవైపు.. ఉద్యోగులు డ్యూటీలు ముగించుకొని ఇళ్లకు చేరుకునే సమయం. ఆపై వాన దంచికొట్టడంతో భారీగా ట్రాఫిక్‌ జామైంది. సెక్రటేరియల్‌, ఖైరతాబాద్‌, అసెంబ్లీ, అమీర్‌‌పేట్‌, బేగంపేట్‌ వంటి ఏరియాల్లో గంటల తరబడి వాహనాలు రోడ్లమీద నిలిచిపోయాయి. సాయంత్రం 5 గంటలకు ఆకస్మాత్తుగా మొదలైన వాన రెండు గంటలపాటు ఏకధాటిగా కురిసింది. కొన్ని ప్రాంతాల్లో అయితే రాత్రి 10 వరకూ వాన పడింది. ఈ సీజన్‌కు ఇదే అతి పెద్ద వాన. అత్యధికంగా ఆసిఫ్‌నగర్‌‌లో 15.1 సెంటీమీటర్లు, షేక్‌పేట్‌లో 12.7 సెంటీమీటర్లు, ఖైరతాబాద్‌లో 12.3 సెంటీమీటర్లు, గండిపేట్‌లో 12.58 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

బేగంపేట్‌, పంజాగుట్ట, టోలిచౌకి, సైఫాబాద్‌, నారాయణగూడ, ఆబిడ్స్‌, సికింద్రాబాద్‌, గోషామహల్‌, కాచిగూడ, నాంపల్లి, అసెంబ్లీ, బషీర్‌‌బాగ్‌ తదితర ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచింది. సీఎం క్యాంప్‌ ఆఫీస్‌, రాజ్‌భవన్‌, పంజాగుట్ట, హైటెక్‌ సిటీ, మైత్రివనం, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ వంటి రూట్లలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. లేక్‌ వ్యూ గెస్ట్‌ హౌజ్‌, లక్డీకపూల్‌, అమీర్‌‌పేట మైత్రీవనం, కేసీపీ చౌరస్తాలు చెరువులను తలపించాయి. అంబర్‌‌పేట్‌ అలీ కేఫ్‌ వద్ద భారీ వానకు మూసారంబాగ్‌ బ్రిడ్జిపైకి మూసీనది వరదనీరు చేరడంతో రాకపోకలు నిలిచాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీటితో నిండి వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. కరెంటు సరఫరాపై ఎన్పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి సమీక్ష నిర్వహించారు. ట్రాఫిక్‌ను సీపీ అంజనీకుమార్‌‌ పర్యవేక్షించారు.

భారీ వర్షం కారణంగా జీహెచ్‌ఎంసీ కాల్‌ సెంటర్‌‌కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ముఖ్యంగా వాటర్‌‌ లాగింగ్‌పై ఎక్కువగా కాల్స్‌ వచ్చాయి. గ్రేటర్‌‌ కాల్‌ సెంటర్‌‌కు 27 ఫిర్యాదులు, డయల్‌ 100కు 29, మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో 12 ఫిర్యాదులు వచ్చాయి. డ్రైనేజీ ఓవర్‌‌ ఫ్లో సమస్యతో కాల్‌ సెంటర్‌‌కు 94, మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో 67, జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లో 4 ఫిర్యాదులు అందాయి. ఇటీవలే భారీ వర్షాలతో హైదరాబాద్‌ ఆగమాగం అయింది. శుక్రవారం కురిసిన అతిభారీ వర్షానికి నగర ప్రజలు మరోసారి భయపడిపోయారు.

Also Read: ఏపీ ప్రజలకు శుభవార్త.. అంతర్రాష్ట్ర సర్వీసులకు గ్రీన్ సిగ్నల్..?

ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంత మంది పాలకులు వచ్చినా కూడా హైదరాబాద్ మునక మాత్రం ఆగడం లేదని.. ఈ పాపం ఎవరిదంటూ హైదరాబాదీలు ప్రశ్నిస్తున్నారు. కబ్జాలను తీసేసి..చెరువులను చెరపట్టిన వారి నుంచి విడిపించి హైదరాబాద్ ను మునిగిపోకుండా కాపాడాలని కోరుతున్నారు.