
కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల దేశంలోని ప్రజల కొనుగోలు శక్తి భారీగా తగ్గింది. అత్యవసరాలకు మినహా మిగిలిన వాటికి ప్రజలు నగదును ఖర్చు చేయడం లేదు. 50,000 రూపాయలకు పైగా పలుకుతున్న 10 గ్రాముల బంగారాన్ని కొనుగోలు చేయడానికి ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అయితే అంత ఖరీదైన బంగారాన్ని ఆ గుడిలో మాత్రం భక్తులకు ప్రసాదంగా పంచుతున్నారు. చాలా సంవత్సరాల నుంచి ఆ గుడిలో ప్రసాదం రూపంలో భక్తులకు బంగారం ఇస్తున్నారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాత్లాం నగరంలో ఉన్న మహాలక్ష్మీ ఆలయం దేశంలో ప్రఖ్యాతి గాంచిన ఆలయాల్లో ఒకటి. ఈ గుడికి వెళ్లి మహాలక్ష్మిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరతాయని భక్తులు చెబుతూ ఉంటారు. దేశంలోని ఏ ఆలయంలోనే భక్తులకు పానీయం, ఆహార పదార్థాలను ప్రసాదంగా ఇస్తారు. అయితే ఈ ఆలయంలో మాత్రం బంగారు, వెండి నాణేలను భక్తులకు ఇస్తున్నారు. చాలా సంవత్సరాల నుంచి ఈ ఆలయంలో బంగారు, వెండి నాణేలు ఇచ్చే సాంప్రదాయం కొనసాగుతోందని భక్తులు చెబుతున్నారు.
అయితే ఆలయంలో భక్తులకు ప్రతిరోజూ బంగారు నాణేలను ఇవ్వరు. దీపావళి పండుగకు ముందు ఐదు రోజుల పాటు ఈ ఆలయంలో ఘనంగా ధన త్రయోదశి ఉత్సవాలు జరుగుతాయి. ధన త్రయోదశి ఉత్సవాలు జరిగే సమయంలోనే భక్తులకు బంగారం, వెండి నాణేల పంపిణీ జరుగుతోంది. నాణేలను పొందిన భక్తులు వాటిని పూజగదిలో పెట్టడం లేదా జాగ్రత్తగా లాకర్ లో భద్రపరచుకోవడం చేస్తారు.
ఈ ఆలయానికి దర్శనానికి వచ్చిన ఏ ఒక్క భక్తుడు ఒట్టి చేతులతో వెళ్లడని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం దీపావళి పండుగ రోజున ఈ ఆలయాన్ని 24 గంటలు తెరిచి ఉంచుతారు. సంవత్సరానికి దాదాపు 100 కోట్ల రూపాయలు డబ్బు, కానుకలు భక్తుల నుంచి వస్తున్నాయి. పండుగ రోజున మహాలక్ష్మి అమ్మవారు డబ్బు, బంగారం మధ్య దర్శనమిస్తుంది.