
ప్రపంచ దేశాలు కరోనా వైరస్ అంతానికి సమర్థంతమైన వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నాయి. పలు వ్యాక్సిన్లు తొలి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ లో మంచి ఫలితాలు సాధించడంతో వ్యాక్సిన్ మరో రెండు మూడు నెలల్లో అందుబాటులోకి వస్తుందని ప్రజలు భావిస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజలకు మరో షాకింగ్ విషయాన్ని వెల్లడించింది.
ఆరోగ్యంగా ఉన్న యువత కరోనా వ్యాక్సిన్ కోసం 2022 వరకు వేచి చూడక తప్పదని పేర్కొంది. డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఫ్రంట్ లైన్ కార్మికులు, ఆరోగ్య సంరక్షణ కార్మికులకు మొదట కరోనా వ్యాక్సిన్ ను ఇస్తామని వెల్లడించారు. వైరస్ వల్ల ఇతరులతో పోలిస్తే హెల్త్ వర్కర్లకు రిస్క్ ఎక్కువగా ఉంటుందని అందుకే వాళ్లకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.
కరోనా వైరస్ కు సమర్థవంతమైన వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా వ్యాక్సిన్ పంపిణీ విషయంలో అనేక మార్గదర్శకాలు ఉంటాయని సౌమ్య స్వామినాథన్ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ శరవేగంగా జరుగుతున్నాయని ఆమె అన్నారు. మొదట కరోనా వ్యాక్సిన్ ఎవరికి ఇవ్వాలనే అంశంపై చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు.
ఫ్రంట్ లైన్ వర్కర్లు, హెల్త్ వర్కర్ల తర్వాత వృద్ధులకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. కరోనా వ్యాక్సిన్ వచ్చినా మొదట చాలా తక్కువ మోతాదులోనే అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. కరోనా మరణాల రేటు గతంతో పోలిస్తే తగ్గుతోందని.. అయితే ప్రజలు ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా కేసులతో పాటు మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు.