ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక కోసం చాలా రోజులుగా జరుగుతున్న తంతుకు ముగింపు పడింది. కాసేపట్లోనే గ్రేటర్ మేయర్, ఉప మేయర్ ఎన్నిక జరగబోతోంది. జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ టీఆర్ఎస్ అభ్యర్థుల పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేసినట్లు సమాచారం.
జీహెచ్ఎంసీ టీఆర్ఎస్ మేయర్ అభ్యర్థిగా బంజారాహిల్స్ టీఆర్ఎస్ కార్పొరేటర్, సీనియర్ నేత కే కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మిని కేసీఆర్ ఎంపిక చేసినట్లు సమాచారం. అలాగే డిప్యూటీ మేయర్ గా తార్నాక కార్పొరేటర్ మోతె శ్రీలత పేరు దాదాపుగా ఖరారైనట్టు తెలిసింది.
మెజార్టీ సభ్యులను బట్టి ఈ మేయర్ ఎన్నిక నిర్వహించనున్నారు. ఫలితంగా ఈ రెండు పదవులును టీఆర్ఎస్ దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టడానికి బీజేపీ, ఎంఐఎం కూడా రెడీ అయ్యాయి.
సీల్డ్ కవర్ లో కేసీఆర్ ఎంపిక చేసిన అభ్యర్థుల పేర్లను మంత్రులు కేటీఆర్, తలసాని, మహమూద్ అలీ తెరువనున్నారని సమాచారం.
ఇక బీజేపీ మేయర్, ఉప మేయర్ అభ్యర్థులు కూడా ఖరారయ్యారు. మేయర్ అభ్యర్థిగా ఆర్కేపురం కార్పొరేటర్ రాధ ధీరజ్ రెడ్డిని ఎంపిక చేశారు. ఉప మేయర్ అభ్యర్థిగా రాంనగర్ కార్పొరేటర్ రవిచారి పేరును ప్రకటించారు.
ఈ ఉదయం 11 గంటలకు కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం ఉంటుంది. 11.30కు మేయర్, ఉప మేయర్ ఎన్నిక ప్రక్రియ ఉంటుంది. పార్టీలన్నీ తమ కార్పొరేటర్లకు విప్ జారీ చేశాయి.