మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు విశాఖ ఉక్కు ఉద్యమ వేడిలో ‘రాజీనామా’తో వేడి రగిలించారు. కానీ అది నిజమైన రాజీనామా కాదు.. కేవలం ప్రజల ఒత్తిడితో కారణం చూపుతూ చేసిన రాజీనామానే.. ఆ రాజీనామా చెల్లదని శాసనసభ వర్గాలు చెబుతున్నాయి.
మొన్నటిదాకా అసలు రాజకీయాల్లో సైలెంట్ గా ఉన్న గంటా శ్రీనివాసరావు ఇప్పుడు ఒక్క రాజీనామాతో ఏపీ రాజకీయాలకు కేంద్రబిందువు అయ్యారు. ఈ ఒక్క చర్యతో ఆయన అందరిచూపును తనవైపుకు తిప్పుకున్నాడు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తూ గంటా చేసిన రాజీనామాతో అధికార వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఒత్తిడి పెరిగింది. వారు కూడా రాజీనామా చేయాలన్న డిమాండ్ వచ్చింది.
అయితే వ్యూహాత్మకంగానే గంటా ఆమోదం పొందకుండా రాజీనామా చేశాడని వైసీపీ వర్గాలు అంటున్నాయి. రాజీనామా చేసేటప్పుడు ఏ కారణం అందులో పేర్కొనకూడదు. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంటూ స్పీకర్ కు గంటా రాజీనామా పంపారు.
అది చెల్లదని అధికార వైసీపీ రాద్ధాంతం చేయడం.. స్పీకర్ కార్యాలయం కూడా చెల్లదు అనడంతో ఈసారి సింగిల్ లైన్ పై తాను రాజీనామా చేస్తున్నట్లు తాజాగా తన లెటర్ ప్యాడ్ పై రాసి స్పీకర్ సీతారాంకు లేఖ పంపించారు.
అయితే ఇది చెల్లదని తేలింది. ఎందుకంటే ఫ్యాక్స్ ద్వారా, ఈమెయిల్, లేఖల ద్వారా రాజీనామా పంపితే చెల్లదు. నేరుగా స్పీకర్ ను కలిసి చేస్తేనే అది చెల్లుతుంది. సో గంటా రాజీనామా ఒట్టి రాజకీయ స్టంట్ అని.. ప్రజలను సంతృప్తి పరచడానికేనని తేలిపోయింది.