
మోడీ సర్కార్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు రైతులు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సహా ఏ పార్టీ కలిసిరాకున్నా కూడా రైతులే రెండు నెలలుగా పైగా నిరసనలు తెలుపుతూ కేంద్రాన్ని షేక్ చేస్తున్నారు. తాజాగా మరోసారి దండెత్తి ఢిల్లీ మెడలు వంచేందుకు రెడీ అయ్యారు.
కేంద్రంలోని బీజేపీ సర్కార్ తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ గణతంత్ర దినోత్సవమైన నేడే రైతులు ఢిల్లీపై దండెత్తారు. దేశ రాజధానికి రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. తొలుత ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘా, టిక్రీ, ఘాజీ పూర్ వద్ద బారికేడ్లను తోసుకుంటూ ఢిల్లీలోకి రైతులు ప్రవేశించారు. దీంతో పోలీసులు అడ్డుకోగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ సమయంలో రైతులు, పోలీసుల మద్య తీవ్ర తోపులాట జరిగింది.
రోడ్డుకు అడ్డంగా ఉంచి కంటెయినర్లను ట్రాక్టర్లతో రైతులు తోసేశారు. అక్షరధామ్, ముబారక్ చౌక్ వద్ద బస్సు అద్దాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. పాండనగర్, కర్నాల్ వద్ద పోలీసులతో రైతులు వాగ్వాదానికి దిగారు.
దీంతో పోలీసులు రైతులపై టియర్ గ్యాస్, వాటర్ క్యాన్ లను పోలీసులు ప్రయోగించారు. పోలీసులు అడ్డుగా పెట్టిన వాహనాలపై దాడిచేసిన రైతులు అనంతరం పోలీసులపై కూడా దాడికి యత్నించారు. ఢిల్లీ ఆర్టీసీకి చెందిన బస్సును ధ్వంసం చేశారు. దీంతో ఢిల్లీలో పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
రైతుల ర్యాలీ ఉద్రిక్తంగా మారడంతో ఢిల్లీ రణరంగమైంది. పరిస్థితులు అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. రైతులు మరో వైపు వెళుతుండడంతో వారిని నియంత్రించేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్నారు.
ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో మెట్రో అధికారులు సైతం అప్రమత్తమై ఢిల్లీలోని కొన్ని మెట్రో స్టేషన్లు మూసివేశారు. రైళ్ల రాకపోకలకు బ్రేక్ వేశారు.