సీనియర్ ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా తీసిన ‘మండలాధీశుడు’ సినిమా విడుదలై అప్పటికే వారం రోజులు అవుతుంది. ఆ రోజుల్లో ఎన్టీఆర్ అభిమానులకు ఎన్టీఆర్ అంటే నటుడు, నాయకుడు కాదు. అవతార పురుషుడు. అందుకే ఆయనకు ఏ చిన్న అవమానం జరిగినా, అప్పట్లో ప్రేక్షకులు అసలు సహించేవారు కాదు. కానీ ‘మండలాధీశుడు’ సినిమాలో ఎన్టీఆర్ గారిని కోట శ్రీనివాసరావు ఫన్నీగా అనుకరిస్తూ ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహానికి కారణమయ్యాడు.
అందుకే ఎక్కడ దొరుకుతాడా అని కోట పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ కారాలు, మిరియాలు నూరుతున్నారు, అందుకే కోట కూడా బయట తిరగడానికి కూడా భయపడుతున్న కాలం అది. అయితే, విజయవాడలో ఉన్న తన కూతురు ఇంటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది కోటకు. దాంతో ఆయన బెజవాడ స్టేషన్ కి చేరుకున్నారు. అప్పటికే విషయం ఎన్టీఆర్ అభిమానులకు తెలిసింది.
కట్ చేస్తే.. ఎన్టీఆర్ అభిమానులతో రైల్వేస్టేషన్ కిటకిటలాడింది. ఎక్కడ చూసినా సైకిల్ గుర్తుతో పచ్చజెండాలు, పువ్వుల దండలు, జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు.. ఇసుకేస్తే రాలనంత మంది జనం. అందరూ కోట కోసమే వెతుకుతూ ఉన్నారు. నిజానికి ఆ వాతావరణమంతా కోలాహలంగా ఉన్నా, కోట శ్రీనివాసరావుకి మాత్రం నరకంలా ఉంది. ఎవడు ఎక్కడ తనని చూస్తాడో.. ? ఆ జనం అంతా తన ఎముకులను కూడా నమిలేస్తారేమో అనే భయం కోటలో ఎక్కువైపోయింది.
అందుకే, సైలెంట్ గా ట్రైన్ దిగి, పారిపోవాలని ఆలోచనలో పడిపోయాడు కోట. ఒకపక్క ఆందోళన, మరోపక్క అనుమానపు భయం, ఈ టెన్షన్ లో ఎవరి కంట పడకుండా బయటపడడానికి కోట రిస్క్ చేసి రైలు దిగాడు. మెల్లిగా జనంలో కలిసిపోయాడు. ‘ఒరేయ్ ఆ నా కొడుకు కోటగాడు అడుగోరా’ అంటూ ఒక కేక కోట చెవిన పడింది. అంతే, అరుపులు కేకలు.. కోటగాడిని పట్టుకోండిరా అంటూ పరుగులు.
కోటను ఎన్టీఆర్ అభిమానులు చుట్టుముట్టి ఎటు కదలకుండా దిగ్బంధనం చేశారు. కోట ఏదో నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసేలోపే.. కాలర్, గొంతు పట్టుకుని స్టేషన్ వెనక్కి లాక్కెళ్లి పడేశారు. అందరూ కలబడ్డారు. కోటను కిందపడేసి తలో కాలు చెయ్యీ ఆడించారు. రక్తం చిందింది. దారుణంగా కొట్టారు. దెబ్బలు కంటే కూడా, ఎక్కువ అవమానం జరిగేలా కొట్టారు. వీడు చస్తే అన్నగారికి అవమానంరా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆలోచించి చివరకు వదిలిపెట్టారు. ఇంతటి అవమానం ఏ గొప్ప నటుడికి జరగలేదు ఒక్క కోటకు తప్ప.