పెళ్లి అనేది జీవితంలో మరిచిపోలేని అనుభూతి. వివాహ బంధంతో ఏకమైన జంట కలకాలం కాపురం చేసుకోవాలని పెళ్లినాటి ప్రమాణాల ఉద్దేశం. కానీ ఎన్ని జంటలు కడదాకా కొనసాగుతున్నాయి. ఇద్దరిలో ఎవరు గీత దాటినా సుదూర తీరాలకు చేరడం ఖాయం. సరదాగా సాగుతున్న వారి సంసారంలో కల్లోలం రేపింది ఓ అగంతకుడు. భార్యాభర్తల మధ్యలో దూరి వారి బతుకులు చిద్రం చేశాడు. చివరికి ప్రాణాలు సైతం కోల్పోయే వరకు వెళ్లింది. వివాహేతర సంబంధాలు జీవితాలను అగాధంలోకి నెట్టేస్తాయి. మొగుడు ఇతర దేశాలకు వెళ్లడంతో భార్యతో అక్రమ సంబంధం నెరిపాడు. దీంతో వారి కుటుంబం చెల్లాచెదురైపోయింది.
తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం మొగలికుదురు గ్రామానికి చెందిన సతీష్ తాపీపని చేసేవాడు. ఏడేళ్ల క్రితం సతీష్ కు పశ్చిమ గోదావరి జిల్లా అచంటకు చెందిన సంధ్య అనే యువతితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. జీవితంలో బాగా సంపాదించాలని భావించి సతీష్ ఉపాధి కోసం సౌదీ వెళ్లాడు. దీంతో ఒంటరిగా ఉన్న సంధ్య సఖినేటిపల్లి మండలం కేశవదాసు పాలెంకు చెందిన ఫణీంద్ర అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అదికాస్త అందరికి తెలియడంతో పంచాయితీ జరిగింది. సంధ్యను పుట్టింటికి పంపించి పిల్లలను తమ వద్దే ఉంచుకున్నారు కుటుంబ సభ్యులు.
సౌదీ నుంచి తిరిగి వచ్చిన సతీష్ జరిగిన సంఘటన గురించి తెలుసుకుని మద్యానికి బానిసయ్యాడు. తల్లిదండ్రులు ఓదార్చినా అతడిలో బాధ పోలేదు. తన భార్యను కలుసుకోవాలని సంధ్య కోసం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం వెలివలకు వెళ్లాడు. అక్కడ సంధ్య మేనమామ ఇంట్లో ఉండడంతో అక్కడికి చేరుకున్నాడు. కానీ శుక్రవారం రాత్రి చించికినాడ వంతెనపైకి భార్య పిల్లలతో సహా వెళ్లి గోదావరిలో దూకేశారు. వంతెన వద్ద ద్విచక్రవాహనంపై పిల్లల దుస్తులు, సూసైడ్ నోటు ఉండడంతో అందరు ఆశ్చర్యపోయారు.
సూసైడ్ నోట్ లో సంధ్య అన్ని విషయాలు వెల్లడించింది. తనను ఫణీంద్ర అనే వ్యక్తి మోసం చేశాడని వాపోయింది. అతడితోపాటు మరికొంత మంది తనను వేధించారని తెలిపింది. తన ఆత్మహత్యకు అతడే కారణమని పేర్కొంది. ఎలాంటి వివాదాలు రాకుండా చూసుకునే సతీష్ కుటుంబం ఫణీంద్ర అనే అగంతకుడి వల్ల ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఎవరు కూడా పరాయి వ్యక్తి మోజులో పడి మోసపోవద్దని సూచిస్తున్నారు. మొగుడు ఉండగా ఇంకో మగాడిపై మనసు పడితే జీవితం ఎక్కడికో పోతుందని తెలియని అమాయకులు దారి మారకుండా చూసుకోవాలని చెబుతున్నారు.