వివేకానందరెడ్డిని ఎవరు హత్యచేశారో ముఖ్యమంత్రి జగన్ కు, ప్రజలందరికీ తెలుసునని ఇదే కేసులో సీబీఐ కస్టడీలో ఉన్న సునీల్ యాదవ్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ హత్యకేసులో ఉన్న పెద్దవాళ్లను తప్పించేందుకే సునీల్ ను ఇరికిస్తున్నారని అన్నారు. ఆ పెద్దవాళ్లతోపాటు సీబీఐ అధికారుల నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని అన్నారు. ఈ మేరకు పులివెందులలో సునీల్ యాదవ్ కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడారు.
ఉద్దేశపూర్వకంగానే సునీల్ ను నిందితుడిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు మాట్లాడని వాచ్ మెన్ రంగన్న.. హత్య జరిగిన రెండేళ్ల తర్వాత ఇప్పుడెందుకు సునీల్ పేరును వాంగ్మూలంలో చెప్పారని ప్రశ్నించారు. ఈ విషయంలో తమ కుటుంబానికి అన్యాయం చేస్తున్నారని, ముఖ్యమంత్రిని కలిసి ఈ విషయం చెప్పడానికి ప్రయత్నిస్తే.. సీబీఐ అధికారులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
ఈ కేసు విషయంలో వివేకా కుమార్తె సునీత 11 మంది అనుమానితుల జాబితాను హైకోర్టుకు అప్పగించారని, ఆ జాబితాలో ఉన్నవారిని సీబీఐ అధికారులు ఎందుకు విచారించట్లేదని ప్రశ్నించారు. సునీల్ ను ఈ కేసులో ఇరికించడానికి రెండున్నర నెలలకు పైగా ఢిల్లీలో దారుణంగా కొట్టారని, హత్యలో ప్రమేయం ఉందని అంగీకరించాలని ఒత్తిడి చేశారని వారు ఆరోపించారు.
ఈ కేసులో అసలు నిందితులు బయటపడతారనే భయంతోనే కడప మేయర్, వైసీపీ నాయకుడు సురేష్ బాబు ఎస్పీని కలిసి విపక్ష నాయకులు చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారని అన్నారు. మొత్తంగా.. అసలైన నిందితులను కాపాడేందుకే.. అమాయకులను ఈ కేసులో బలిపెడుతున్నారని ఆరోపించారు. మరి, వీరి ఆరోపణలపై ప్రభుత్వం, సీబీఐ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.