దీపావళి పండుగ అంటే చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఎంతో ఉత్సాహంగా మన ఇంటిని అలంకరించుకొని కొత్తబట్టలు ధరించి, పిండివంటలు ఆలక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించి పూజిస్తారు. మన భారతదేశంలో ఉత్తరాది రాష్ట్రాలలో ఈ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగ రోజు లక్ష్మీ దేవిని ప్రత్యేక అలంకరణలో పూజించి సంధ్యా సమయంలో ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. కానీ ఈ పండుగ రోజు ఎందుకు దీపాలు వెలిగిస్తారు? బాణాసంచాలు ఎందుకు పేలుస్తారు? అన్న విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…
పూర్వం దేవతలు, రాక్షసులు క్షీరసాగరమధనం చేస్తున్నప్పుడు సముద్రం నుంచి లక్ష్మీదేవి ఆశ్వయుజ మాసం అమావాస్య రోజున ఉద్భవించడం వల్ల లక్ష్మీ దేవి పుట్టినరోజు సందర్భంగా ఈ పండుగకు లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. అంతేకాకుండా కార్తీక మాసం అమావాస్య రోజున లక్ష్మీదేవి విష్ణుమూర్తిని వివాహం చేసుకుందని మరొక కథ కూడా ప్రచారంలో ఉంది. అందువల్ల ఈ పండుగను దీపాలను వెలిగించి, ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు.
మన భారతదేశంలో రైతాంగం వెన్నెముక వంటిది.అలాంటి రైతులు పండించే పంటలు దీపావళి పండుగ వచ్చే సమయానికి పంట కోతలు పూర్తిచేసుకొని ధనధాన్యాలతో ఇంటికి చేరుకుంటాయి. కాబట్టి @రైతులు ఎంతో ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారు.
మహాభారతం ప్రకారం కౌరవుల చేతిలో జూదంలో ఓడిపోయిన పాండవులు 13 సంవత్సరాలు వనవాసం చేశారు.అలాగే ఒక సంవత్సరం పాటు అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని తిరిగి వారి రాజ్యానికి విజయంతో తిరిగి వెళ్లేటప్పుడు అక్కడి ప్రజలు సంతోషంతో దీపాలను వెలిగించి వారికి స్వాగతం పలుకుతారు. అప్పటి నుంచి అక్కడి ప్రజలు దీపావళిని అందుకు ప్రతీకగా జరుపుకుంటున్నారు.
ద్వాపరయుగంలో విష్ణు భగవానుడు శ్రీ కృష్ణుడు గా అవతారమెత్తి నరకాసురుని వధించడానికి యుద్ధం చేస్తున్నప్పుడు విష్ణువు వరం వల్ల నరకాసురుని చంపలేక, యుద్ధభూమిలో స్పృహతప్పి పడిపోతాడు. అప్పుడు సత్యభామ నరకాసురుని చంపి పదహారువేలమంది గోపికలను నరకాసురుని చెరనుంచి విముక్తి చేస్తుంది. నరకాసురుడు చనిపోయేటప్పుడు తన తప్పును తెలుసుకుని తన మరణాన్ని ప్రతి ఒక్కరు కాంతులు విరజిమ్మేలా జరుపుకోవాలనే వరాన్ని పొందుతాడు. అందువల్ల దీపావళి రోజున ప్రతి ఒక్కరు దీపాలను వెలిగించి,బాణాసంచా కాలుస్తూ ఎంతో ఘనంగా జరుపుకుంటారు.
తన తండ్రి మాటను జవదాటని శ్రీరాముడు తన తండ్రి కోరిక మేరకు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయడానికి వెళ్తాడు. అక్కడ అరణ్యవాసం చేస్తున్న సమయంలో సీతను రావణాసురుడు అపహరిస్తాడు. రావణాసురుని తో యుద్ధం చేసి సీతకు విముక్తి కలిగించి తిరిగి అయోధ్యకు కార్తీక అమావాస్య రోజున వెళ్లడం వల్ల ఆరోజున అయోధ్య ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.ఈ విధమైన కారణాలు ప్రాచుర్యంలో ఉండటం వల్ల ప్రజలు దీపావళి పండుగను దీపాలు వెలిగించి, బాణాసంచాలు కాలుస్తూ ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు.