
ప్రపంచ దేశాలతో పోల్చి చూస్తే భారత్ లో గుడ్డు వినియోగం చాలా ఎక్కువ. వైద్యులు చిన్నపిల్లల నుంచి వృద్దుల వరకు ప్రతి ఒక్కరినీ గుడ్డు తీసుకోమని సూచిస్తూ ఉంటారు. శరీరానికి గుడ్డు ద్వారా అనేక రకాల పోషకాలు లభిస్తాయి. గుడ్డును ఉడకబెట్టి తిన్నా, పచ్చిగా తీసుకున్నా ఆరోగ్యానికి మంచిదే. అయితే వైద్యులు మాత్రం ఉడికించిన గుడ్డు తీసుకోవడం వల్ల ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతుంటారు. ఎదిగే పిల్లలకు కావాల్సిన ప్రోటీన్లు గుడ్డు ద్వారా అందుతాయి. నిజానికి గుడ్డు హై లెవెల్ కొలెస్ట్రాల్ ఫుడ్ అయినప్పటికీ ఆరోగ్యానికి హానికరం కాదు.
శరీరానికి కావాల్సిన శాచురేటెడ్ ఫ్యాట్లు, అన్ శాచురేటెడ్ ఫ్యాట్లు గుడ్డు ద్వారా లభిస్తాయి. గుడ్డులో ఉండే కొవ్వులు హెడీఎల్ లెవల్‌ను పెంచి గుండె జబ్బుల బారిన పడకుండా సహాయపడతాయి. శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి రోజుకు రెండు గుడ్ల వరకు తినవచ్చని చెబుతున్నారు. గుడ్డులో ఉండే కోలిన్ అనే పోషక పదార్థం మెదడు ఆరోగ్యాన్ని సైతం రక్షిస్తుంది. ఉదయం అల్పాహారంతో పాటు గుడ్డును తీసుకుంటే మరీ మంచిది.
గుడ్డు తీసుకునే వారిలో కంటి శుక్లాలు వచ్చే సమస్య తగ్గడంతో పాటు దృష్టి మెరుగుపడుతుంది. ప్రోటీన్లు పుష్కలంగా ఉండే గుడ్డు బరువు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు గుడ్డులో ఉండే ఐరన్ ఎంతో మేలు చేస్తుంది. నరాల బలహీనతతో బాధ పడేవారికి ఆ సమస్య తగ్గేందుకు గుడ్డు సహాయపడుతుంది. గుడ్డు తినడం వల్ల శరీరానికి సరిపడా కొవ్వులు అందుతాయి.
గుడ్డు కండరాల బలాన్ని పెంచడంతో పాటు క్యాన్సర్ బారిన పడకుండా రక్షిస్తుంది. కొలెస్ట్రాల్ జబ్బులతో బాధ పడే వాళ్లు , టైప్ 2 డయాబెటిస్ ఉన్నవాళ్లు, ఫుడ్ అలర్జీ ఉన్నవాళ్లు మాత్రం గుడ్లను తీసుకోకపోవడమే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తూ ఉండటం గమనార్హం.