
దేశంలోనే అత్యధిక హామీలతో తమిళనాడు ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేసింది డీఎంకే పార్టీ. ఆ పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ ఏకంగా తమిళప్రజలపై 500 వరకు హామీలు గుప్పించడం రికార్డుగా చెప్పొచ్చు. దేశంలోని ఏ పార్టీ ఇంత భారీ స్థాయిలో ప్రజలకు హామీలు ఇవ్వలేదంటే నమ్మండి. తమిళనాట ప్రజలను సోమరులను చేసేలా పార్టీలు మరీ ఇంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇన్ని హామీలతో ఇక ప్రజలు పనిచేయకుండా ప్రభుత్వంపై ఆధారపడి బతుకుతారని మేధావులు ఈసడించుకుంటున్నారు.
తమిళనాడులో వచ్చే నెల 6న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలోనే ఈసారి అధికారంలోకి ఖచ్చితంగా వస్తుందని అంచనాలున్న డీఎంకే పార్టీ తన మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. ఇందులో 500 హామీల వరకు గుప్పించడం విశేషం. అంతేకాదు..ఈ ఎన్నికల హామీల అమలుకు ప్రత్యేక మంత్విత్వశాఖ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపి డీఎంకే అధినేత స్టాలిన్ అందరినీ ఆశ్చర్యపరిచాడు.
డీఎంకే ప్రధాన హామీల్లో కేంద్రంలోని బీజేపీ పెంచేసిన పెట్రో ధరల తగ్గింపును ఈసారి మేనిఫెస్టోలో ప్రకటించింది. రాష్ట్రంలోని ఉద్యోగులు, భక్తులు, మధ్యతరగతి ప్రజలు అందరికీ ఏదో ఒక హామీతో లబ్ధి చేకూర్చేలా ఈ మేనిఫెస్టో ఉంది. వీటిలో పెట్రోల్, డీజిల్, పాల ధరల్ని తగ్గించడం, రేషన్ కార్డు దారులకు రూ.4 వేలు సాయం, రైతులకు మోటార్లు కొనుక్కునేందుకు రూ.10 వేల సాయం, ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్ధులకు ట్యాబ్లెట్ పీసీలు, గ్యాస్ సిలెండర్లపై రూ.100 రాయితీ, అమ్మ క్యాంటీన్ల తరహాలో 500 కలైంజర్ ఫుడ్ స్టాళ్లు, ట్రిచీ, మధురై, సాలెం, నెల్లాయ్, కోయంబత్తూర్‌కు మెట్రో రైళ్లు, 30 ఏళ్ల లోపు విద్యార్ధుల రుణాల రద్దు వంటివాటిని పొందుపరిచారు. ఉచిత డేటా, మహిళలకు ఏడాది మాతృత్వసెలవు, నీట్ పరీక్ష ఎత్తేయడం వంటి కీలక హామీలు ఉన్నాయి. ఇక మహిళలకు మాతృత్వపు సెలవులు పెంపు, గుళ్లకు భారీగా నిధుల కేటాయింపు వంటి అంశాలకు చోటిచ్చారు.
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే విజయం సాధించాలని పట్టుదలగా ఉన్న డీఎంకే మేనిఫెస్టోలో భాగంగా ఓటర్లకు ఇస్తున్న హామీల వెనుక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఉన్నారు. డీఎంకే ఆయనను వ్యూహకర్తగా నియమించుకుంది. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఈరోజు తన పార్టీ మేనిఫెస్టోలో ఏకంగా 500 హామీలు ఇవ్వడం సంచలనమైంది. ఇక ఏపీ సీఎం జగన్ బాటలోనే స్టాలిన్ కూడా పరిశ్రమల్లో స్థానికులకు 75శాతం కోటా అమలు చేస్తానని ప్రకటించారు. అసెంబ్లీని లైవ్ ఇస్తామని కూడా తెలిపారు.ఇక తొలిసారి గుళ్లు, చర్చిలు, మసీదుల అభివృద్ధికి నిధులు ఇస్తామని డీఎంకే మేనిఫెస్టోలో చేర్చింది.