ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ మహోగ్రరూపమై దూసుకొస్తుండడంతో ప్రజలు వణికిపోతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు.. అందరూ టీకా కోసం ఎదురు చూస్తున్నారు. అయితే.. దేశంలో ఇప్పుడు రెండు టీకాలు వినియోగంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ ఒకటి కాగా.. ఆక్స్ ఫర్డ్ రూపొందించిన కొవిషీల్డ్ రెండోది. దీన్ని సీరం ఇనిస్టిట్యూట్ భారత్ లో ఉత్పత్తి చేస్తోంది. అయితే.. ఈ రెండిట్లో ఏది ప్రభావవంతమైంది? అనే ప్రశ్న ఎంతో కాలంగా ఉంది.
నరేంద్ర మోడీ టీకా తీసుకున్న సమయంలో ఈ విషయమై పెద్ద చర్చ జరిగింది. ప్రధాని ది బెస్ట్ ను ఎంచుకుంటారు కాబట్టి.. అది ఏంటీ? అని తెలుసుకునేందుకు జనాలు ప్రయత్నించారు. అయితే.. ఆ వివరాలు బయటకు రాలేదు. కానీ.. ఆ సందేహం మాత్రం అలా మిగిలిపోయింది. అయితే.. ఇప్పుడు ఆ రెండు టీకాల్లో ఏది బెస్ట్ అనేది ప్రకటించింది ఐసీఎంఆర్.
కొవాగ్జిన్ భారత్ సొంతంగా తయారు చేసిన టీకా. నిజానికి.. దీని మూడో దశ పరీక్షా ఫలితాలు రాకుండానే అత్యవసర వినియోగం కింద ఉపయోగిస్తున్నారు. అయితే.. ఇప్పుడు ఆ ఫలితాలు వచ్చాయట. ఈ టీకా ప్రభావశీలత 78 శాతం అని ఐసీఎంఆర్ ప్రకటించింది. దీంతో.. కొవిషీల్డ్ కన్నా.. భారతీయ టీకా కొవాగ్జినే మెరుగైనదని చెప్పింది.
ఈ టీకాను ఎక్కువగా ప్రజలకు అందుబాటులోకి తేనున్నట్టు సమాచారం. ఇటీవల ముడి సరుకులు కొనుగోలు చేసేందుకు కూడా డబ్బుల్లేక వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. దీంతో.. టీకా ఉత్పత్తి మందగించింది. ఈ నేపథ్యంలో భారత్ భయోటెక్ సంస్తకు రూ.1500 కోట్ల రుణం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్, బెంగళూరు ప్లాంట్లలోనూ ఉత్పత్తి చేయనున్నట్టు సమాచారం.